
యువతకు కువైట్‌లో ఉపాధి అవకాశాలు
రాజమహేంద్రవరం రూరల్: నిరుద్యోగ యువతకు కువైట్‌లో అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి విడిజి మురళి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఓవర్సీస్ మ్యానన్ పవర్ కంపెనీ ఆఫ్ ఏపీ సంయుక్తంగా తాతృయ అనే అంతర్జాతీయ సంస్థతో కలిసి కువైట్‌లో ఉన్నత నైపుణ్యం కలిగిన నిర్మాణ కార్మికులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. ఈ అవకాశాన్ని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్హత కలిగిన 24 నుంచి 50సంవత్సరాల వయసు కల్గిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిరామిక్ ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ లేదా సీలింగ్ పనుల్లో ఐటీఐ లేదా డిప్లమా ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. 3–5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఉద్యోగావకాశం, నెలకు కువైట్ డాలర్ కెడబ్ల్యూడి 200 నుంచి 250 (భారత రూపాయలలో సుమారు రూ.56,000 – రూ70,000 వరకు) జీతంగా లభించనున్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాలు ఉద్యోగ ఒప్పంద కాలవ్యవధి అన్నారు. వీసా ప్రాసెసింగ్, విమాన టికెట్లు, వైద్య సదుపాయాలు నివాస ఏర్పాట్లను కంపెనీ అందిస్తుందన్నారు. అభ్యర్థులు తమ పాస్‌పోర్టు, ఐటీఐ/డిప్లమా సర్టిఫికెట్, అనుభవ సర్టిఫికెట్‌లను సమర్పించాలన్నారు. ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 99888 53335 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
గుండెపోటుతో
ఉపాధ్యాయుడి మృతి
గోకవరం: అప్పటి వరకూ విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విధి నిర్వహణలో గుండెపోటుకు గురై తనువు చాలించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గోకవరం గ్రామానికి చెందిన బొమ్మగంటి నాగభూషణం (57) తంటికొండ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో లెక్కల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఆయన రెండు తరగతుల్లో బోధించారు. ఇంటర్వెల్ సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోగా తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆయన్ని 108 వాహనంలో గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఇటీవల రంపయర్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి బదిలీపై తంటికొండకు వచ్చారు.
కుమార్తె వివాహం చేసిన నెలలోనే..
ఉపాధ్యాయుడు నాగభూషణంకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు గత నెలలో ఘనంగా వివాహం జరిపించారు. ఇంతలోనే ఈ విషాద ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.