
చివరికి దిగొచ్చి... కొబ్బరి కాయలు వినియోగించి..
ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి కల్యాణంలో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించారు. కొబ్బరి ధరలు పెరగడంతో వాటిని పక్కనబెట్టి అభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ‘సాక్షి’ దినపత్రికలో ‘వీరేశ్వరా.. క్షమించవా’ అనే శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో దేవస్థానం అధికారులు స్పందించి స్వామివారికి నిర్వహించే అభిషేకాల్లో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించడం మొదలు పెట్టారు. రూ.వెయ్యి పెట్టి అభిషేకం చేయించుకుంటున్న భక్తుల పేరున వినియోగించాల్సిన రెండు కొబ్బరి కాయలను వాడకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనికి స్పందించిన ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ కొబ్బరికాయలతో అభిషేకం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో గతంలో జరిగినట్లే కల్యాణ అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. కొబ్బరికాయలు అందుబాటులో లేకపోవడంతో కల్యాణ భక్తులకు అసౌకర్యం కలిగిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఆలయ సూపరింటెండెంట్‌ను ఆరా తీయగా కొబ్బరి కాయల పాటదారుడు సకాలంలో కొబ్బరికాయలు సరఫరా చేయకపోవడం వల్ల అసౌకర్యం కలిగిందని, ఇది తన దృష్టికి రాగానే చర్యలు తీసుకున్నానని చెప్పారు. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు.

చివరికి దిగొచ్చి... కొబ్బరి కాయలు వినియోగించి..