
పరుగులు తీసిన సిబ్బంది
డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ కిక్
మామిడికుదురు: పాశర్లపూడి, పాశర్లపూడి లంక గ్రామాల సరిహద్దులో ఓఎన్జీసీ బావి వద్ద డ్రిల్లింగ్ నిర్వహిస్తుండగా, బుధవారం రాత్రి గ్యాస్ కిక్ ఇచ్చింది. 20 మీటర్ల ఎత్తులో భారీ శబ్దంతో గ్యాస్ ఎగజిమ్మడంతో డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు సైతం తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. కొద్ది సేపటి తరువాత గ్యాస్ కిక్‌ను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 3 నెలల క్రితం ఈ–2003 నెంబరు రిగ్గుతో ఈ బావిలో డ్రిల్లింగ్ చేపట్టారు. 2910 మీటర్ల లక్ష్యం మేరకు డ్రిల్లింగ్ నిర్వహించాల్సి ఉంది. 2,880 మీటర్లకు డ్రిల్లింగ్ చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ కిక్‌ను అదుపు చేసిన అనంతరం స్థానికులు కిక్ వద్దకు చేరుకుని అధికారులపై మండిపడ్డారు. ఏం జరిగిందని నిలదీశారు. ఏం జరిగిందో తమకు కూడా తెలియదని సమాధానం చెప్పడంతో సిబ్బందిపై మండిపడ్డారు.