ప్రతిభావంతుల లెక్క తేలింది.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతుల లెక్క తేలింది..

Jul 6 2025 6:40 AM | Updated on Jul 6 2025 6:40 AM

ప్రతిభావంతుల లెక్క తేలింది..

ప్రతిభావంతుల లెక్క తేలింది..

జిల్లాలో పూర్తయిన సర్వే

కొత్తగా 327 మంది గుర్తింపు

జిల్లాలో ఇప్పటికే 2,896 మంది పిల్లలు

గుర్తించిన వారికి

సమీప పాఠశాలల్లో అడ్మిషన్లు

రాయవరం: ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం సహిత విద్యలో భాగంగా భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వారి స్థాయి, అవసరాలకు అనుగుణంగా విద్యను అందించేందుకు వారికి ఈ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయి. మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల బలోపేతానికి సమగ్ర శిక్షా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా భవిత కేంద్రానికి వచ్చే చిన్నారులతో పాటు, రాకుండా ఇంటి వద్దే ఉంటున్న చిన్నారుల లెక్క తేల్చేందుకు మే 13వ తేదీ నుంచి జూన్‌ 9వ తేదీ వరకు ప్రత్యేక సర్వే నిర్వహించారు. సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్‌ ఎంవీవీ సత్యనారాయణ పర్యవేక్షణలో జిల్లాలో ఉన్న ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ టీచర్స్‌ (ఐఈఆర్‌టీ) ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు మరికొంత మందిని గుర్తించారు. జిల్లాలోని 22 మండలాల్లో ఇప్పటికే 2,896 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉండగా, తాజాగా చేసిన సర్వేలో 327 మందిని గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందేలా జిల్లా అధికారులు సమగ్ర నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు.

యూ–డైస్‌లో నమోదు

విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులను మండల యూనిట్‌గా లెక్కించారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన 2,986 మందితో పాటు, కొత్తగా గుర్తించిన 327 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో వారి వయసుకు అనుగుణంగా ఆయా తరగతుల్లో ప్రవేశం కల్పించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఆధార్‌ కార్డుకు అనుసంధానం చేస్తూ, ఆయా పాఠశాలల యూ–డైస్‌ కోడ్‌లో విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. దీంతో ప్రత్యేక అవసరాల పిల్లల వాస్తవ గణాంకాల్లో పారదర్శకతతో పాటు, వారు ఎక్కడ చదువుతున్నారనేది తెలుసుకునే అవకాశం ఉంది.

భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ

జిల్లాలో 22 భవిత కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు ఏడుగురు ఫిజియోథెరపిస్టులు చిన్నారులకు సేవలందిస్తున్నారు. అలాగే శారీరక, మానసిక వైకల్యంతో ఉన్న చిన్నారులు కావటంతో వీరికి ఆటపాటలతో చదువులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన ఆట పరికరాలు, వస్తువులను కేంద్రాలకు సమకూరుస్తున్నారు. ప్రతి భవిత కేంద్రంలో ఇరువురు ఐఈఆర్‌పీలు కేంద్రానికి వచ్చే చిన్నారులకు విద్యను అందిస్తారు. వీరితో పాటు ప్రతి కేంద్రంలో ఒకరిని ఆయాగా నియమించారు. శారీరక వైకల్యం అధికంగా ఉన్న చిన్నారులకు ఇంటి వద్దనే అవసరమైన వైద్య సేవలు అందించేలా ఫిజియోథెరపిస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం హోమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా పాఠశాలకు వెళ్లని విభిన్న ప్రతిభావంతులైన చిన్నారుల ఇళ్లకు ఐఈఆర్‌పీలు వెళ్లి బోధన చేస్తారు.

జిల్లాలో పరిస్థితి ఇదీ

జిల్లాలో భవిత కేంద్రాలు 22

ప్రత్యేక అవసరాల పిల్లలు 2,986

భవిత కేంద్రాలకు వచ్చే వారు 486

హోమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ 220

పొందుతున్న వారు

కేంద్రాల్లోని ఐఈఆర్‌పీలు 44

ఆయాలు 22

ఫిజియోథెరపిస్టులు 07

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement