
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో ఐదుగురికి చోటు
అమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలలో జిల్లా నుంచి నలుగురికి స్థానం లభించింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ సమాచారాన్ని జిల్లా పార్టీకి పంపించింది. రాష్ట్ర వలంటీర్స్ విభాగం జోనల్ అధ్యక్షుడిగా రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన కట్టా రామ శేఖర్, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ జోనల్ అధ్యక్షునిగా భూపతి అజయ్‌కుమార్ (రాజోలు నియోజకవర్గం), రాష్ట్ర స్టూడెంట్ విభాగం అధికార ప్రతినిధిగా తాడి సహదేవ్ (రాజోలు నియోజకవర్గం), రాష్ట్ర సోషల్ మీడియా విభాగం కార్యదర్శిగా పడాల శ్రీహరికృష్ణ రెడ్డి (కొత్తపేట నియోజకవర్గం) నియమితులయ్యారు.
రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రుద్రరాజు
మలికిపురం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సఖినేటిపల్లి మండలం గుడిమూలకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు రుద్రరాజు వెంకట నరసింహ శ్రీ పద్మరాజు (చిన్నరాజా) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి రుద్రరాజు రామలింగరాజు కుటుంబం నుంచి చిన్నరాజాకు పార్టీ పదవి దక్కడంపై నియోజక వర్గ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. చిన్నరాజా శనివారం మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అలుపెరుగని కృషి చేస్తానన్నారు. తనకు పదవి కోసం సహకరించిన నియోజకవర్గ కోఆర్డినేటరు గొల్లపల్లి సూర్యారావు, నాయకులు కేఎస్‌ఎన్ రాజు, జంపన బుజ్జీరాజు, ఎంపీపీ వీరా మల్లిబాబు, జెడ్పీటీసీలు దొండపాటి అన్నపూర్ణ, బల్ల ప్రసన్న కుమారి, మట్టా శైలజ, కుసుమ వనజ కుమారి, పాటి శివకుమార్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
10న మెగా పేరెంట్
టీచర్ సమావేశం
అమలాపురం రూరల్: ఈ నెల పదో తేదీన మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 నిర్వహించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలలో ఈ సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
విద్యాభివృద్ధికి
‘విట్‌నెస్’ అవసరమా?
అమలాపురం టౌన్: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాఠశాలలో జరిగే మెగా పీటీఎంలో విట్‌నెస్ అధికారిని పాఠశాల హెచ్‌ఎం నియమించి వారి చేత వీడియోలు తీయించి అప్‌లోడ్ చేయాలనే సమగ్ర శిక్ష రాష్ట్ర శాఖ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీఏఎస్ సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వీరు అమలాపురంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో విట్‌నెస్ అధికారి విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు కలిసి విద్యార్ధుల క్రమశిక్షణపైన, విద్యాభివృద్ధిపైన మాట్లాడుకోవటానికి ఇంత తతంగం అవసరమా అని వారు ప్రశ్నించారు. బోధనకు మాత్రమే ఉపాధ్యాయులను పరిమితం చేస్తామని చెప్పిన విద్యా శాఖ దానికి భిన్నంగా బోధనేతర కార్యక్రమలకూ వినియోగించడం తగదని నాయకులు పేర్కొన్నారు.
శృంగార వల్లభుని ఆలయానికి
పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలమాలలతో విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా ఆలయానికి 3,84,962 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేశామన్నారు.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో ఐదుగురికి చోటు