
మానసిక ప్రశాంతతకు విపశ్యన ధ్యానం
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: ఒత్తిడిని అధిగమించి శాంతి సాధనకు విపశ్యన ధ్యానం మంచి మార్గమని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎంఈవోలు, హెచ్‌ఎంలతో ఈ ధ్యానంపై సమీక్షించి విద్యార్థులతో సాధన చేయించాలని సూచించారు. చదువుకునే విద్యార్థులలో ఒత్తిడిని అధిగమించేందుకు, ఆధ్యాత్మిక మార్గం సాధనకు ఈ ధ్యానం ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 8 వసతి గృహ పాఠశాలల్లో ఈ ధ్యానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు వ్యక్తిగత శ్రద్ధతో ఈ ధ్యానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులను వయసుల వారీగా విభజించి ఆగస్టు 15 నాటికి డీఈఓకు ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. ఈ మేరకు మౌలిక వసతులు సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. విపశ్యన ధ్యాన గురువు వాణి మాట్లాడుతూ జిల్లాలో 8 రెసిడెన్షియల్ పాఠశాలలో మిత్ర కార్యక్రమం ద్వారా 2700 మంది విపశ్యన ధ్యాన యోగలో శిక్షణ పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో ధ్యాన యోగ గురువులు లక్ష్మయ్య, నాగార్జున, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఎంఈవోలు పాల్గొన్నారు.
ఎన్‌ఎంఆర్ వేతనాల సవరణ
2025– 26 ఆర్థిక సంవత్సరానికి నాన్ మస్తర్ రోల్ వేతనాలు సవరించినట్టు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. నైపుణ్యం కలవారికి రూ.734 నుంచి రూ.764 వరకు, మధ్యస్థాయి నైపుణ్యం చూపేవారికి రూ.518 నుంచి రూ.539 వరకు, నైపుణ్యం లేని పనివారికి రూ.416 నుంచి రూ.433 ల వరకు పెంచడం జరిగిందన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి వేతనాల సవరణ కోసం వివిధ విభాగాల ఇంజినీర్లు, కార్మిక శాఖ సహాయ కమిషనర్లతో సంప్రదింపులు జరిపి వేతనాలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.