
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు కలెక్టర్ ఆదేశాలు
అమలాపురం రూరల్: జిల్లాలో వివిధ పథకాల కింద కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సంబంధిత ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పలు నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. జొన్నాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు, వంతెన అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారాయని, వారం రోజుల్లో బాగు చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అప్రోచ్ రోడ్లను నవంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. పాశర్లపూడి జంక్షన్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నగరంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి, గెద్దాడలో పనులు సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. టోల్ ప్లాజా నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలన్నారు. అయినవిల్లిలో 400 కేవీ ఉప కేంద్రానికి, నూతనంగా 130 కేవీ 64 టవర్లకు భూసేకరణ పూర్తయిందన్నారు. కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి శానిపలిలంక వద్ద రైతులు భూమి ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. నరసాపురం బైపాస్ రోడ్డుకు 98 శాతం భూసేకరణ పూర్తయిందన్నారు. ఊడిమూడిలంక–జి.పెదపూడిలంక వంతెనను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. వాడపల్లి వద్ద సైఫాన్ పనులను వేగవంతం చేయాలన్నారు. ద్రాక్షారామలో ఇండస్ట్రియల్ పార్క్‌కు 4 ఎకరాల స్థల సేకరణ చేసినట్టు చెప్పారు. జేసీ టి.నిషాంతి, ఏపీ ఐసీసీ జోనల్ మేనేజర్ ఎ.రమణారెడ్డి, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
వంతెన పనులపై సమీక్ష
పి.గన్నవరం: ఊడిమూడిలంక–జి.పెదపూడిలంక గ్రామాల వశిష్ట నదీపాయపై రూ.49.5 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులపై కలెక్టర్ మహేష్‌కుమార్ తన కార్యాలయంలో సమీక్షించారు. పీఆర్ ప్రాజెక్ట్ ఈఈ పి.రామకృష్ణారెడ్డి, డీఈ అన్యం రాంబాబు, కాంట్రాక్టర్ పీపీ రాజు పనుల పురోగతిని కలెక్టర్‌కు, జేసీ నిశాంతికి వివరించారు. జరుగుతున్న పనులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.