
కోటిపల్లి వంతెన ప్రతిపాదనలతో సరి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పడ్డాక ముక్తేశ్వరం, కోటిపల్లి రేవు మధ్య రాకపోకలు పెరిగాయి. దీంతోపాటు దశాబ్ద కాలంగా హామీగా ఉండిపోయిన ముక్తేశ్వరం, కోటిపల్లి మధ్య వంతెన నిర్మాణం సైతం తెరపైకి వచ్చింది. కత్తిపూడి–నర్సాపురం ఫెర్రీ (కేఎన్‌ఎఫ్) రోడ్డులో భాగంగా కోటిపల్లి వద్ద వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. జిల్లా ఏర్పడ్డాక రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు చెందినవారు కలెక్టరేట్, ఇతర పనుల కోసం జిల్లా కేంద్రమైన అమలాపురం రావడం పెరిగింది. ఇప్పుడు పడవలు, పంట్లపై రాకపోకలు చేయాల్సి రావడం వాహనచోదకులకు వ్యయప్రయాసగా మారింది. దీంతో ఇక్కడ వంతెన ఆవశ్యకతను గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎంపీ చింతా అనూరాధ విశేష కృషి చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ జయరామ్ గడ్కరీని ఒప్పించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అప్పట్లో ఆయన ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు కూడా. ప్రభుత్వం మారడంతో దీని ఊసే లేకుండా పోయింది.