
డ్రైన్‌లో ఆవు మూగ వేదన
అతి కష్టంపై తీసిన అగ్నిమాపక సిబ్బంది
అమలాపురం టౌన్: స్థానిక విత్తనాల వారి కాల్వ ప్రాంతంలో ఓ ఆవు రోడ్డు పక్క డ్రైన్‌లో ప్రమాద వశాత్తు పడిపోయి బయటకు వచ్చేందుకు నరక యాతన పడింది. డ్రైన్‌లో పడి ఇరుక్కుపోయిన ఆవు అవస్థ చూసిన స్థానికులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ దళ్ కార్యకర్తలు స్పందించి అగ్ని మాపక దళానికి సమాచారం అందించారు. ఆ సిబ్బంది తాళ్లు, చెక్క బల్లలతో ఆవును తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మరో ప్రయత్నంగా డ్రైన్‌ను కొంచెం పగలగొట్టి ఆవును బయటకు తీశారు. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎల్.విజయరెడ్డి కూడా అక్కడకు చేరుకుని ఆవును ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. ఆవు సురక్షితంగా బయటకు రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.