వెన్నుపోటు ఫిక్స్!
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
● సూపర్ సిక్స్..
సాక్షి, అమలాపురం: ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిది. ఎన్నికల ఫలితాలు వచ్చాక మేనిఫెస్టోను మడతపెట్టి అవతల పాడేయాలి అనే సూత్రాన్ని కూటమి ప్రభుత్వం ఒంట బట్టించుకుంది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్‌ను అమలు చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి ప్రచారం ప్రారంభించారు. బాబు ష్యూరిటీ... భవిష్యత్తు గ్యారంటీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీల వర్షం కురిపించారు. తర్వాత బాబుతో జట్టు కట్టిన ప్రస్తుత ఉపముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం సూపర్ సిక్స్ అమలు బాధ్యత తాను తీసుకుంటానని గొప్పగా చెప్పుకున్నారు. కానీ వాస్తవంగా దానిలో ఒక్క పథకాన్ని కూడా ఇప్పటి వరకు సంపూర్ణంగా అమలు చేయలేదు.
సూపర్ సిక్స్ హామీ–1
యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా
నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
నిరుద్యోగ భృతిని ప్రభుత్వం విజయవంతంగా ఎగ్గొట్టింది. జిల్లాలో 50 వేల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా. నెలకు రూ. 3వేల చొప్పున రూ.180 కోట్లను విజయవంతంగా ఎగ్గొట్టేసింది. కొత్తగా ఉద్యోగాల మాట అటు ఉంచి, తొమ్మిది వేల మందినికి పైగా ఉన్న వలంటీర్ల వ్యవస్థను ఎత్తివేసింది. ఇంటింటా ఇచ్చే రేషన్ ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి కొత్త నిరుద్యోగులను సృష్టించింది. అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్‌పై సంతకం చేసి ఈ రోజుకి పూర్తి చేయలేదు.
సూపర్ సిక్స్ హామీ–2
స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి
ఏడాదికి రూ.15 వేలు
గత ప్రభుత్వం అమ్మ ఒడి రూపంలో అర్హులైన ప్రతి కుటుంబంలోని ఒక విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం పాఠశాలలో చదివే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తానంది. ఈ లెక్కన చూస్తే జిల్లాలో 1.45 లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి రూ.217.50 కోట్లు అందించాల్సి ఉంది. గత ఏడాది సొమ్మను కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఎగొట్టింది. ఈ ఏడాది ఇస్తానని ప్రకటించినా ఏదో వంకతో లబ్ధిదారులను కుదించి వేస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది.
సూపర్ సిక్స్ హామీ– 3
ప్రతి రైతుకు ఏటా రూ. 20వేల సాయం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఏటా మూడు దఫాలుగా రైతులు ఖాతాలో సొమ్ము జమ చేసేది. రైతుకు ఏటా 13,500 చొప్పున ఆర్థిక సహాయాన్ని ఐదేళ్లపాటు అందించింది. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి రైతుకు రూ.20వేల చొప్పున అందిస్తామని చెప్పింది. దీనికి అన్నదాత సుఖీభవ అనే పేరు కూడా పెట్టింది. గత ఏడాది ఇవ్వాల్సిన సొమ్ము రూ.480 కోట్ల దిక్కూమొక్కూ లేదు. ఈ ఏడాది ఇస్తామని చెబుతున్నప్పటికీ ఎంత అనేది మాత్రం ప్రకటించలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి వస్తే జిల్లాలో 1,45,890 మంది రైతులకు రూ.482.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
సూపర్ సిక్స్ హామీ–4
ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి
మూడు గ్యాస్ సిలిండర్‌లు
జిల్లాలో 3.90 లక్షల మంది వరకు గ్యాస్ వినియోగదారులున్నారని అంచనా. వీరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా, గత ఏడాది కేవలం ఒక సిలిండరు మాత్రమే ఉచితంగా అందించారు. అది కూడా లబ్ధిదారులలో సగం మందికే.
సూపర్ సిక్స్ హామీ–5
ప్రతి మహిళకు నెలకు రూ.1,500
అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఖాతాలో జమ చేస్తామని చెప్పి అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మహిళల ఖాతాలో జమ చేయలేదు. 18 ఏళ్ల వయసు దాటిన వారి నుంచి 60 ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులని తెలిసింది. ఈ విధంగా చూస్తే జిల్లాలో కనీసం 4.50 లక్షల మంది వరకు అర్హులు ఉన్నట్టుగా అంచనా. నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాల్సి ఉంది. ఏడాది కాలంలో జిల్లాలో మహిళలకు రూ.810 కోట్లను కూటమి ప్రభుత్వం బకాయి పడినట్టయ్యింది.
సూపర్ సిక్స్ హామీ – 6
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీని అమలును దఫ దఫాలుగా వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు తాజాగా దీనిని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాటి నుంచి అమలు చేస్తామని చెబుతోంది. ఈ పథకం అమలుపై ప్రభుత్వం ఏడాది కాలంగా ఇంకా విధివిధానాల రూపకల్పనలోనే ఉన్నట్టు చెబుతుండటం విశేషం. ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు అయితే జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది.
కానరాని సంక్షేమం...
అక్కరకు రాని సాయం
కూటమి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది
సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని
నెరవేర్చని వైనం
ఏడాది పాలనపై జిల్లా వాసుల
పెదవి విరుపు
రైతులు, మహిళలు, నిరుద్యోగులు,
ఉద్యోగుల్లో అసంతృప్తి
నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు
గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి బుధవారానికి ఏడాది పూర్తి కావస్తోంది. కూటమి ప్రభుత్వానికి పగ్గాలు అప్పగించి కూడా ఏడాది అవుతోంది. నాటి నుంచి నేటి వరకు ఏడాది పాటు ప్రశ్నిస్తే అణచివేయడం, రెడ్‌బుక్ పేరుతో అరాచకం, ఇసుక తవ్వకాలు, ప్రభుత్వ కార్యక్రమాలలో అక్రమాలు ఇలా సాగిపోతోంది పాలన. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి, దళితులకు, మహిళలకు అందాల్సిన సంక్షేమ పథకాలు దాదాపు నిలిచిపోయాయి. రైతులు, నిరుద్యోగులు వంటి వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం ఆగిపోయింది. మొత్తం మీద కూటమి ఏడాది పాలన సామాన్య ప్రజలకు దగా... మోసం అన్నట్టుగా సాగిపోయింది. సర్కారు నిర్వాకంపై నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు.
హామీలు గుర్తున్నాయా? బాబూ... పవన్
ఎన్నికల ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీల్లో కొన్ని..
నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను ఉచితంగా అందించి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం
కల్లుగీత కార్మికుల నుంచి వృత్తి పన్ను వసూలు చేయకుండా వారు ఉచితంగా కల్లు గీసుకునే వెసులుబాటు
సఖినేటిపల్లి– నరసాపురం వంతెన నిర్మాణ పనులు పూర్తికి కృషి
కోనసీమ టూరిజం హబ్‌గా మార్పు
జిల్లా వ్యాప్తంగా గోదావరి నదీ కోత నివారణకు గ్రోయిన్లు, రివిట్‌మెంట్ల నిర్మాణం
వరదల సమయంలో కె.ఏనుగుపల్లి, ఎదురుబిడియం కాజ్‌వేలు ముంపుబారిన పడకుండా వంతెనల నిర్మాణం
అప్పనపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, తాగునీరు
కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ)ని కోనసీమకు తీసుకురావడం. కొబ్బరి పరిశ్రమల ఏర్పాటు. నైపుణ్యాభివృద్ధి ద్వారా చిన్న పరిశ్రమల ఏర్పాటు. కొబ్బరిలో నాణ్యమైన మొక్కలను స్థానికులకు అందేలా చర్యలు
కోనసీమ రైల్వేలైన్ త్వరితగతిన పూర్తి
ఇసుక దోపిడీ
రాష్ట్రంలో అధికారం మారిన జూన్ 4వ తేదీ రాత్రి నుంచి జిల్లాలో ఇసుక దోపిడీ మొదలై ఇప్పటి వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అంతకుముందు ప్రభుత్వం ముందస్తుగా నిల్వ ఉంచిన ఇసుక స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను కొల్లగొట్టుకుపోయారు. లారీకి అదనంగా రూ.ఐదు వేల చొప్పున దోపిడీ చేశారు. ప్రభుత్వ అధికారిక ర్యాంపులలోనే బరి తెగించి అక్రమాలకు పాల్పడ్డారు. ముసివేసిన ర్యాంపులలో ఇప్పటికీ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. రోజూ రూ.కోట్ల విలువైన ఇసుకను తవ్వుకుపోతున్నారు. పి.గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, అల్లవరం, కాట్రేనికోన, మామిడికుదురు, మలికిపురం, రాజోలు ఇలా చెప్పకుంటూ పోతే గోదావరి ప్రవహించే ప్రతి చోటా అక్రమ ఇసుక ర్యాంపులు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. లంక మట్టితోపాటు సముద్రతీరంలోని ఇసుకను పెద్ద ఎత్తున తవ్వేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.
నిరసనల పథం
కూటమి ప్రభుత్వ విధానాలపై విసిగి వేశారిన పలు ప్రజా సంఘాలు, ఆయా వర్గాలవారు తమ నిరసనను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. కలెక్టరేట్ వద్ద ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సందర్భంగా పలు సంఘాల వారు నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. రాజోలు బీసీ సంక్షేమ శాఖ వసతిగృహం వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల నిరసనను కలెక్టరేట్ వద్ద గేట్లు బంద్ చేసి పోలీసులు అడ్డుకున్నారు. సీహెచ్‌వోలు, వ్యవసాయ కార్మికులు, యానిమేటర్లు ఇలా పలు సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. జీతం బకాయిలు చెల్లించాల్సి ఉందని సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పారిశుధ్య కార్మికులు, వాచ్‌మన్‌లు ఆందోళన చేశారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగం విజయవంతంగా నడుస్తోంది. సామాన్య కార్యకర్త నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపై ఎడాపెడా కేసులు పెడుతూనే ఉన్నారు. రావులపాలెంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావులతోపాటు 41 మందిపై రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో 2025 జనవరి 31వ తేదీన మూడు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను సైతం ఇస్టానుసారం అరెస్టు చేశారు. జిల్లాలో నలుగురిపై కేసులు నమోదు చేసి వారిలో ఒకరిని జైలుకు పంపించారు.
వెన్నుపోటు ఫిక్స్!


