ఇంటర్ తరగతులు ప్రారంభం
● అంతంత మాత్రంగా హాజరు
● జిల్లాలో 136 కళాశాలలు
రాయవరం: జిల్లాలో ఇంటర్మీడియెట్ కళాశాలలు సో మవారం పునఃప్రారంభమయ్యాయి. పదవ తరగతి అనంతరం ఇంటర్‌లో చేరిన విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. అయితే రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు మండుతుండడంతో విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. 2025–26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలండర్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసింది.
ప్రవేశాలు అంతంత మాత్రం
మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలు, ల్యాబ్‌లు, డిజిటల్ విద్య, ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ద్వారా బోధన, ఇంటర్ విద్యతో లభిస్తున్న భవిష్యత్ అవకాశాలను వివరిస్తున్నారు.
జిల్లాలో కళాశాలల పరిస్థితి ఇదీ..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 136 కళాశాలలున్నాయి. 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ఎయిడెడ్ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఆరు, ఒకేషనల్ జూనియర్ కళాశాలలు 18, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 67, హైస్కూల్ ప్లస్‌లు 31 ఉన్నాయి. గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 17,253 మంది ఉత్తీర్ణత సాధించగా, వీరిలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో చేరనున్నారు. గత విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 12,613 మంది ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ విద్యను అభ్యసిస్తారు.
235 పనిదినాలు
ఇంటర్మీడియెట్ బోర్దు అకడమిక్ క్యాలండర్‌ను ఏప్రిల్‌లోనే విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. నూతన అకడమిక్ క్యాలండర్ ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో 235 పనిదినాలు ఉంటాయి. మొత్తం 314 రోజులకు 79 రోజులు సెలవు దినాలున్నాయి. జూలై 17 నుంచి 19 వరకు యూనిట్–1, ఆగస్టు 18 నుంచి 20 వరకు యూనిట్–2, సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇస్తారు. అక్టోబరు 22 నుంచి 24 వరకు యూనిట్–3, నవంబరు 17 నుంచి 22 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, డిసెంబరు 15 నుంచి 20 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. జనవరి 21 నుంచి 28 వరకు ప్రీ ఫైనల్–2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు, 2025–26 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి 18 చివరి పనిదినంగా నిర్ణయించారు.


