
అయ్యో.. అసలే వద్దంటారా..!
● పంపాలో స్నానాలు వద్దంటున్న దేవస్థానం
● యువకుడి మృతితో చర్యలు
● అప్రమత్తం చేసే బదులు ఇదేం పని?
● ఘాట్‌లలో రక్షణ ఏర్పాట్లు
చేయాలని భక్తుల విన్నపం
అన్నవరం: భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వెళ్లిన వారు గోదావరిలో స్నానం చేయకూడదని బోర్డులు ఏర్పాటు చేసి, సెక్యూరిటీ గార్డులను కాపలా పెడితే ఎలా ఉంటుంది? అన్నవరం పంపా జలాశయం వద్ద ఇటువంటి పరిస్థితే భక్తులకు ఎదురవుతోంది. పంపా జలాశయంలో శ్రీచక్ర స్నానం గొయ్యిలో మునిగిపోయి బుధవారం ఒక యువకుడు మృతి చెందిన విషయం విదితమే. అక్కడ గొయ్యి ఉందని తెలియక, పెద్దగా లోతుండదని భావించి వెళ్లిన అతడు ఆ గోతిలో పడి మృతి చెందాడు. అక్కడ దేవస్థానం అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ గొయ్యి చుట్టూ మెష్ ఏర్పాటు చేసి, కర్రలు పాతి, జెండాలు అమర్చినా గొయ్యి ఉందనే విషయం అందరికీ తెలిసి ఉండేది. అటువంటి చర్యలేవీ తీసుకోకపోవడంతో ఓ యువకుడి నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద సంఘటనతో మేల్కొన్న అధికారులు విచిత్రమైన చర్య తీసుకున్నారు. ‘గేట్లు దాటి లోపలకు వెళ్లేందుకు ప్రవేశం లేదు’ అంటూ అధికారులు పంపా గేట్లకు గురువారం ఫ్లెక్సీలు తగిలించారు. అలాగే, నది వద్ద ‘ఇచ్చట నీటిలో దిగుట ప్రమాదకరం’ అని బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే, పంపాలో స్నానం చేయడం నిషిద్ధమని బోర్డులు పెట్టారు. దీంతో, పంపా జలాశయానికి స్నానం చేయడానికి వస్తున్న భక్తులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పండగలు, కార్తిక మాసం వంటి పవిత్ర దినాల్లో పంపా నదిలో స్నానం చేసి, సత్యదేవుని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తూంటారు. దేవస్థానం అధికారులు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలే తప్ప మొత్తానికే స్నానం చేయవద్దంటే ఎలాగని భక్తులు ప్రశ్నిస్తున్నారు.