
కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు
రాజోలు: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం పెదలంకలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పెదలంక గ్రామానికి చెందిన 15 ఏళ్ల నీతిపూడి పౌలుకుమార్ ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద గోదావరిలో మంగళవారం గల్లంతయ్యాడు. 15 ఏళ్ల క్రితం పౌలుకుమార్ తండ్రి నాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ప్రస్తుతం కుమారుడు పౌలుకుమార్ గోదావరిలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పౌలుకుమార్ తల్లి నాగలక్ష్మి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లగా నాన్నమ్మ వద్ద ఉంటున్నాడు. రాజోలు మండలం తాటిపాక మఠం గ్రామానికి ఆనుకుని పెదలంక ఉండడంతో పౌలుకుమార్ 10వ తరగతి వరకు తాటిపాక ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇటీవల 10వ తరగతి పాసయ్యాడు. నెల రోజుల క్రితం నాన్నమ్మ గారి ఊరైన పెదలంక నుంచి అమ్మమ్మ గారి ఊరైన పి.గన్నవరం మండలం నాగుల్లంక వెళ్లాడు. ఈ నెల 24వ తేదీన పౌలుకుమార్ పెదలంక వచ్చి మళ్లీ అమ్మమ్మగారి ఇంటికి వెళ్లాడని నాన్నమ్మ భాగ్యవతి భోరున విలపించింది. నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోతే మనుమడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని కంటతడి పెట్టుకుంది. గోదావరిలో గల్లంతైన మనుమడు పౌలుకుమార్ కోసం విలపిస్తున్న నాన్నమ్మ భాగ్యవతి, తాతయ్య నాగేశ్వరరావులను చుట్టుపక్కల వారు ఓదార్చారు.

కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు