
మా ఆందోళన ఎవరికీ పట్టదా?
పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి
వారాహి యాత్ర సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వినతిపత్రం ఇవ్వగా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో మేము ఆందోళనకు దిగాల్సి వచ్చింది. నేరుగా కలుద్దాం అని కాకినాడ నుంచి పిఠాపురంలో జనసేన కార్యాలయానికి పాదయాత్రగా వెళితే ఆయన అందుబాటులో లేరు సరికదా బాధ్యులు కూడా కనిపించలేదు. మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం.
– ఎస్.వెంకటరమణ, యూనియన్ ఉమ్మడి తూర్పు
గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ
శ్రమ దోపిడీకి గురవుతున్నాం
మున్సిపాలిటీ, కార్పొరేషన్ల లో ఇంజినీరింగ్ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నా రు. అన్ని అత్యవసర విభాగాల్లోనూ మేమే సేవలందిస్తున్నాం. పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచారు.. మాకు మాత్రం పెంచడం లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో పాల్గొంటాం.
– ఉండవల్లి వీరవెంకటరమణరాజు,
యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు,
సామర్లకోట మున్సిపాలిటీ
● మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ఆవేదన
● సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 20 రోజులుగా సమ్మె
● హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ పట్టించుకోని వైనం
పిఠాపురం: మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇంజినీరింగ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వినతిపత్రం అందజేయాలని వారు చేసిన ప్రయత్నం విఫలమయినట్లు కార్మికులు చెబుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న తమకు సరైన జీత భత్యాలు లేవంటున్నారు. తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశామని కార్మికులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 4,500 మంది ఇంజినీరింగ్ విభాగంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందిగా పని చేస్తున్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, మంచినీటి పథకాల నిర్వహణ తదితర పనులు చేస్తుంటారు. అయితే తమకు పనికి తగ్గ వేతనాలు లేవని, దీంతో జీవనోపాధి కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలకు రూ.13,087 మాత్రమే వేతనం ఇస్తున్నారని చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో వారాహి యాత్రకు వచ్చిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు, యువగళంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రాలు ఇచ్చామని అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని చెప్పారు. కానీ మా సంగతి పట్టించుకోలేదు.
డిమాండ్లు ఇవీ..
కార్మిక చట్టాల ప్రకారం ఇంజినీరింగ్ కార్మికులకు రూ.29,200, టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందికి రూ. 24,500 చొప్పున జీతాలు చెల్లించాలి.
15 ఏళ్లు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలి
ప్రభుత్వం ప్రకటించే 52 ఆదివారాలు, 17 దేశ జాతీయ, రాష్ట్ర పండగ దినాలను సెలవు రోజులుగా ప్రకటించాలి లేదా వేతన దినాలుగా అయినా పేర్కొనాలి.
విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు నష్టపరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
విధి నిర్వహణ భారంగా మారి శరీరం సహకరించని వారికి, దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి ప్రభుత్వం వైద్య సేవలందించాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
లేబర్ యాక్టు ప్రకారం సీనియారిటీని ఎటువంటి సర్టిఫికెట్లు లేకుండా గుర్తించి టెక్నికల్ ఉద్యోగులుగా నిర్ణయించి వారికి తగిన జీతాలు ఇవ్వాలి.
కార్మిక చట్టాల ద్వారా సంక్షేమ పథకాలు, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలి.
ఇంజినీరింగ్ విభాగంలో వాటర్ బోర్డును ఏ ర్పాటు చేయాలి. స్వయం ప్రతిపత్తి కల్పించాలి.
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి.
–పదవీ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా గ్రాడ్యూటీతో పాటు కనీసం రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలి, లేదా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

మా ఆందోళన ఎవరికీ పట్టదా?

మా ఆందోళన ఎవరికీ పట్టదా?

మా ఆందోళన ఎవరికీ పట్టదా?