
రత్నగిరిపై పడకేసిన రక్షణ
కీలకమైన ప్రదేశాలలో
కనిపించని సెక్యూరిటీ గార్డులు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సెక్యూరిటీ పడకేసింది. దేవస్థానంలో కీలక ప్రాంతాలలో ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు.
సెక్యూరిటీ కోసం దేవస్థానం ఏడాదికి సుమారు రూ.నాలుగు కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో ప్రయివేట్ సెక్యూరిటీ గార్డులు వివిధ చోట్ల దాదాపు 60 మంది పనిచేస్తున్నారు. వీరిపై దేవస్థానం నియమించిన సెక్యూరిటీ సూపర్‌వైజర్ కూడా ఉన్నారు. కాని వీరెవరూ సరిగా విధులు నిర్వహించకపోయినా అడిగే నాథుడు లేడు. టోల్‌గేట్ వద్ద, రత్నగిరిపై, వై.జంక్షన్‌ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డులు కనిపిస్తారు.
పశ్చిమ రాజగోపురం వద్ద కానరాని సెక్యూరిటీ
దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం చాలా కీలకమైన చోటు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో 80 శాతం మంది పశ్చిమ రాజగోపురం రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడ నుంచి వంద మీటర్లు దూరంలో అన్నదానం భవనం ఉంటుంది. వాహనాల పార్కింగ్ స్థలం అక్కడకు 150 మీటర్ల దూరం. పశ్చిమ రాజగోపురం వద్దనే దేవస్థానం బస్సులు ఆగుతాయి. ఇంత ప్రాధాన్యం కలిగిన స్థలంలో కనీసం నలుగురు అయినా సెక్యూరిటీ గార్డులు ఉండాలి. కాని ఒక్కరూ కూడా ఉండడం లేదు. వ్రతాలు, కల్యాణం, ఇతర సేవా టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ వద్ద కూడా ప్రయివేట్ షాపుల వద్ద పనిచేసేవారే భక్తులను నియంత్రిస్తున్నారు. అక్కడ కూడా సెక్యూరిటీ గార్డులు ఎవరూ ఉండడం లేదు. గత శనివారం విపరీతమైన రద్దీ ఉన్న సమయంలో వ్రతాల టిక్కెట్లను ఒక వ్యక్తి బ్లాక్‌లో అమ్ముతుండగా హోమ్‌గార్డు పట్టుకుని మందలించి వదిలేశారు. ఈ విషయం గుర్తు పెట్టుకుని అయినా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. కాని సోమవారం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ కనిపించలేదు.
రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో...
రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు వద్ద కూడా అదే పరిస్థితి. ఇక్కడ గతంలో ఒక సెక్యూరిటీ గార్డు ఉండేవాడు. ఇప్పుడు ఒక్కరు కూడా ఉండడం లేదు. స్వామివారి సన్నిధికి విచ్చేసే సామాన్య భక్తులు స్వామివారి వ్రతాలు, దర్శనం, అన్నదానం పథకంలో భోజనం చేశాక రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో సేద తీరుతారు. కొంతమంది మహిళా భక్తులు వ్రతాల సమయంలో తాము ధరించిన పట్టుచీరలు, నూతన చీరలను అక్కడ ఆరబెట్టి కొంతసేపు నిద్రపోతుండగా అదను చూసి కొంతమంది దొంగలు ఆ చీరలను పట్టుకుపోతున్నారు. ఆ షెడ్డుకు గల సెల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్ల వద్ద కూడా సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి కొంత సేపు ఆదమరిస్తే చాలు ఆ ఫోన్లు ఉండవక్కడ. ఇవే కాదు భక్తుల బ్యాగ్‌లు, విలువైన వస్తువులు కూడా దొంగలు అపహరిస్తున్నారు. ఎదురుగా ఈఓ కార్యాలయం ఉన్నప్పటికీ ఈ విశ్రాంతి షెడ్డులో దొంగతనం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.
ఇక్కడ రాత్రివేళల్లో వివాహాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో పెళ్లి బృందాలలోని మహిళల ఆభరణాలు, నగదు కూడా చోరీ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం ఎదురుగా గల ఉచిత డార్మెట్రీ వద్ద కూడా సెక్యూరిటీ లేదు. ఇలా చాలాచోట్ల సెక్యూరిటీ లేకపోవడంతో దొంగలు చెలరేగిపోతున్నారు. దేవస్థానం అధికారులు పశ్చిమ రాజగోపురం వద్ద, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు వద్ద, ఉచిత డార్మెట్రీ వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి. పోలీసులు కూడా ఈ ప్రాంతాలలో రద్దీ సమయాల్లో హోం గార్డులతో తనిఖీలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.

రత్నగిరిపై పడకేసిన రక్షణ