
పోలీసులమని చెప్పి బెదిరిస్తున్న ఇద్దరి అరెస్టు
రూ.1,000 నగదు, రాయల్ ఎన్‌ఫీల్డ్, బటన్ చాకు స్వాధీనం
రాజమహేంద్రవరం రూరల్: పోలీసులం అని చెప్పి హైవేపై వాహనాలను ఆపి డబ్బు దోచుకుంటున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసి,. వారి వద్ద నుంచి రూ.1,000 నగదు, రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనం, బటన్ చాకును స్వాధీనం చేసుకున్నారు. బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి 12.10 గంటలకు దివాన్‌చెరువు ఫారెస్టు ఏరియాలో ఇద్దరు వ్యక్తులు రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై వచ్చి బొలెరో వాహనాన్ని నిలుపుదల చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను బొలెరో వాహనానికి అడ్డుగా పెట్టి తాము పోలీసులమని చెప్పి కత్తి చూపించి బెదిరించారు. బొలెరో వాహనం డ్రైవర్‌ను కొట్టి జేబులోని రూ.1,000 నగదు దోపీడీ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పెదమానాపురంనకు చెందిన బొలెరో డ్రైవర్ కూరడ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్ మురళీమోహన్ కేసు నమోదు చేశారు. అనంతరం ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. దివాన్‌చెరువు గ్రామశివారు పాలచర్ల రోడ్డులో మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన సిర్ర జాస్పర్‌ప్రిన్స్ ఎలియాస్ జాస్పర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన గుడిసెరాబిన్‌లను అరెస్టు చేశారు. నిందితులు గతంలో ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని డీఎస్పీ విద్య తెలిపారు. వీరిపై దారి దోపిడీ, గంజాయి కేసులు వివిధ పోలీసు స్టేషన్‌లలో ఉన్నాయని చెప్పారు. బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం పాల్గొన్నారు.