
బదిలీలకు గ్రీన్ సిగ్నల్
రాయవరం: ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రెండేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న బదిలీలను పాఠశాలల పునఃప్రారంభంలోపు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు బదిలీల జీవో 22ను ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి విడుదల చేసింది. దీంతో బుధవారం నుంచి బదిలీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన..
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్‌ఎంలకు బదిలీలు జరగనున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన వీటిని నిర్వహిస్తారు. 2017 ఆగస్టు 31కి ముందు ఆ పాఠశాలలో విధుల్లో చేరిన స్కూల్ అసిస్టెంట్/ఎస్‌జీటీ తత్సమాన క్యాడర్, 2020 ఆగస్టు 31 ముందు విధుల్లో చేరిన గ్రేడ్–2 హెచ్‌ఎంలు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే 2027 మే నెలాఖరు లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని క్యాడర్లకు చెందిన సుమారు 18 వేల మంది వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు
● బదిలీల ప్రక్రియకు సంబంధించి బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. 28న ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది.
● స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 21 నుంచి 24 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌న్1, 2 తేదీల్లో ఆప్షన్లు పెట్టుకోవాలి.
● ఎస్‌జీటీలు ఈ నెల 21 నుంచి 27 వరకూ దరఖాస్తులు చేసుకోవాలి. వీరికి జూన్ ఏడు నుంచి 10వ తేదీ వరకూ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది.
హామీలకు కట్టుబడాలి
ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి. బదిలీ జీవోలో ప్రధానంగా మూడు అంశాల్లో స్పష్టత కొరవడింది. ఎస్‌జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్, ఖాళీలు బ్లాక్ చేయకుండా ఉండడం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల స్టడీ లీవ్ ఖాళీల విషయంలో హామీలను అమలు చేయాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్
స్పష్టత లేదు
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో జరిపిన చర్చల ప్రకారం మరికొన్ని విషయాల్లో అధికారులు స్పష్టంగా జీవోలు విడుదల చేయాలి. ఇంగ్లిషు మీడియంతో సమానంగా తెలుగు మీడియం నిర్వహించాలన్న అంశం, మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలన్న అంశాలపై స్పష్టత లేదు. – నరాల కృష్ణకుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ
నిబంధనల ప్రకారమే..
బదిలీ షెడ్యూల్ విడుదలైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపడుతున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బదిలీలు నిర్వహిస్తాం. విద్యాశాఖ నుంచి వచ్చిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కిందస్థాయికి చేరవేసి, ఎటువంటి గందరగోళానికి తావులేకుండా నిర్వహిస్తాం.
– పి.రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా
విడుదలైన జీవో
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
కొన్ని అంశాలపై స్పష్టత లేదంటున్న
ఉపాధ్యాయ సంఘాల నేతలు

బదిలీలకు గ్రీన్ సిగ్నల్

బదిలీలకు గ్రీన్ సిగ్నల్

బదిలీలకు గ్రీన్ సిగ్నల్