
యోగాతో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం
అమలాపురం రూరల్: యోగాతో అనేక శారీరక, మానసిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. యోగాంధ్ర – 2025ను పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు బుధవారం కలెక్టరేట్‌లో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. యోగాభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ జీవనశైలిలో భాగంగా చేసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి మాట్లాడుతూ ఈ నెల 27న ప్రజాప్రతినిధులతో, 28న మండల స్థాయిలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తహసీల్దార్లతో ర్యాలీలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రసాద్, డీఆర్‌ఓ రాజకుమారి, యోగా మాస్టర్ దుర్గాప్రసాద్, ఓం శాంతి ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా పరీక్షలు
రాయవరం: ఏపీఈఏపీ సెట్–25 ఆన్‌లైన్ పరీక్షలు మూడో రోజు జిల్లాలోని రెండు కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 806 మంది దరఖాస్తు చేసుకోగా 771 మంది హాజరయ్యారు. వీరిలో ఉదయం 381 మంది, మధ్యాహ్నం 390 మంది పరీక్షలు రాశారని కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు.
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.55 కోట్లు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 26 రోజులకు గాను రూ.1,55,04,639 ఆదాయం వచ్చింది. హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. ఈ కానుకల్లో నగదు రూ.1,46,96,779, చిల్లర నాణేలు రూ.8,07,860 వచ్చాయని చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. బంగారం 48 గ్రాములు, వెండి 730 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. రోజుకి సరాసరి రూ. 5,96,332 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. అమెరికా డాలర్లు 184, కెనడా డాలర్లు 15, సింగపూర్ డాలర్లు రెండు, ఇంగ్లాండ్ పౌండ్లు ఐదు, స్కాట్‌లాండ్ పౌండ్లు పది, కువైట్ దీనార్లు 20, యూఏఈ దీరామ్స్ 25, ఖతార్ రియాల్స్ పది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహరెన్ దీనార్ ఒకటి లభించాయి. వేసవి సెలవులు, వివాహాలు, ఈ నెల ఏడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు కారణంగా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వీరంతా కానుకలు వేయడంతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్‌రావు లెక్కింపులో పాల్గొన్నారు.
పార్టీ తప్పిదం వల్లనే
కార్యకర్తల్లో అసహనం
– టీడీపీ కాకినాడ రూరల్
మినీ మహానాడులో జ్యోతుల నవీన్
కాకినాడ రూరల్: తెలుగుదేశం పార్టీ తప్పిదం వల్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల ముందు నుంచి ఇన్‌చార్జిని ప్రకటించాలని కార్యకర్తలు మొర పెట్టుకుంటున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద స్పందన ఫంక్షన్ హాలులో బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడును నిర్వహించారు. పరిశీలకుడిగా శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్తిబాబు హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ కాకినాడ రూరల్‌లో జనసేన ఎమ్మెల్యేను నెగ్గించుకున్నామని, ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

యోగాతో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం

యోగాతో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం