
ఒకటి నుంచి ఏపీ గ్రామీణ బ్యాంక్ సేవలు
అల్లవరం: భారత ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఎస్‌ఓ 1625(ఈ) ప్రకారం ఆంధ్ర ప్రగతి, గ్రామీణ వికాస్, చైతన్య గోదావరి, సప్తగిరి గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా మే 1 నుంచి ఖాతాదారులకు సేవలు అందించనుందని దేవగుప్తం సీజీజీబీ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరాజు బుధవారం తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మే 1 నుంచి ఖాతాలు, సేవలు ఎప్పటిలాగే కొనసాగుతాయన్నారు. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని కోరారు.
వాడపల్లి వెంకన్నకు
భక్తురాలు నిలువు దోపిడీ
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామివారికి ఓ మహిళ నిలువు దోపిడీ సమర్పించుకున్నారు. పేరూ, ఊరూ చెప్పని ఆ భక్తురాలు బుధవారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని, ఆమె వద్ద ఉన్న బంగారు వస్తువులన్నీ తీసి వస్త్రంలో మూటకట్టి స్వామివారి గర్భాలయం ముందు ప్రధాన హుండీలో వేశారు.
గ్రామాలను
ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి
జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ వారి జీవనశైలిలో మార్పులు తీసుకువస్తూ గ్రామాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల పనితీరు, ఐవీఆర్‌ఎస్ నివేదికలపై చర్యలు, ప్రత్యేక డ్రైవ్‌లో పరిశుభ్రత చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అధికారుల సమన్వయంతో అన్ని ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాల పనితీరును మెరుగ్చుపర్చాలన్నారు. కాలువలు, డ్రెయినేజీలు, రహదారుల్లో చెత్తను వేయరాదని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో దశలవారీగా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వస్తువుల నిరోధానికి చర్యలు చేపట్టి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ నిరోధానికి అవసరమైతే జరిమానాలు విధించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రచార హోల్డింగ్స్‌ను జంక్షన్లకు వంద మీటర్ల పరిధిలో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీపీఓ శాంతలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలందించే వారికి గుర్తింపు
విధి నిర్వహణలో మెరుగైన సేవలందించే అధికారులకు ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. మామిడికుదురు తహసీల్దార్ ఎదురువాడ వెంకట సుబ్రహ్మణ్యాచారి ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌తో పాటు, డీఆర్‌ఓ బీఎల్‌ఎన్ రాజకుమారి, ఏఓ విశ్వేశ్వరరావులు సుబ్రహ్మణ్యా చారి దంపతులను జ్ఞాపికలు, శాలువాతో సత్కరించారు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలి
రాజమహేంద్రవరం సిటీ: ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం స్థానిక ఏిపీ ఎన్జీవో హోమ్ లో క్యాప్కో ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. క్యాప్కో జిల్లా కన్వీనర్ ధర్నాలకోట వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. అనంతరావు మాట్లాడుతూ తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు తక్షణం ఫుడ్ సేఫ్టీ యాక్ట్–2006 కమిటీ సభ్యుల నియామకం చేపట్టాలన్నారు. ప్రైవేటు స్కూళ్లు కాలేజీల ఫీజుల నియంత్రణ చేయాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఒకటి నుంచి ఏపీ గ్రామీణ బ్యాంక్ సేవలు