
సృష్టి కర్తా శ్రమ జీవే..
కపిలేశ్వరపురం: సంపదకు మూలం శ్రమ. ఆ శ్రమను చేసే శ్రామికులు దశా, దిశా నిర్ణేతలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా మానసిక, శారీరక శ్రామికులున్నారు. కాకినాడ జిల్లాలో 62, తూర్పుగోదావరి జిల్లాలో 38, కొనసీమ జిల్లాలో 7 మొత్తం 107 మధ్య తరహా, భారీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. కాకినాడ జిల్లాలో 1,81,000 హెక్టార్లు, తూర్పుగోదావరి జిల్లాలో 1,23, 027, కోనసీమ జిల్లాలో 1,49,000 హెక్టార్లు వరి సాగవుతోంది. వ్యవసాయానికి అనుబంధంగా రవాణా, రైసుమిల్లు రంగాలు బలోపేతమై ఉన్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం శ్రామికులను విస్మరిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే శ్రామిక నిరసనలను ఎదుర్కొంటోంది.
ఉమ్మడి జిల్లాలో శ్రామిక శక్తి
కాకినాడ పోర్టు, రాజమహేంద్రవరంలో వర్తక, వ్యాపారాలు, కోనసీమ జిల్లాలో ఆక్వా, కొబ్బరి తదితర రంగాల్లో విస్తారంగా శ్రామికులు ఉత్పత్తి రంగంలో శ్రమిస్తున్నారు. కోనసీమ జిల్లాలో 1,726, తూర్పుగోదావరి జిల్లాలో 1,556 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో విస్తారంగా అంగన్‌వాడీలున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 3,500 మంది అంగన్‌వాడీలున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1.53 లక్షల జాబ్ కార్డులకు 2.27 లక్షల మంది, కాకినాడ జిల్లాలో 1.96 లక్షల కార్డులకు 1.95 లక్షల మంది, తూర్పుగోదావరి జిల్లాలో 1,61,372 కార్డులకు 1,11,815 మంది ఉపాధి కూలీలున్నారు. కాకినాడ జిల్లాలో 620, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో 512 చొప్పున మొత్తం 1,144 సచివాలయాల పరిధిలో వేలాది మంది ఉద్యోగులున్నారు. కోనసీమ జిల్లాలో 355, కాకినాడ జిల్లాలో 428, తూర్పుగోదావరి జిల్లాలో 364 ఎండీయూ వాహనాల నిర్వాహకులున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,200 మంది ఆశా కార్యకర్తలున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 815, కాకినాడ జిల్లాలో 1,060, కోనసీమ జిల్లాలో 1,017 మొత్తం 2,892 మంది వీఓఏలున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 108, కోనసీమ జిల్లాలో 166, కాకినాడ జిల్లాలో 72, మొత్తం 320 వ్యవసాయ సహకార సంఘాల్లో 1,650 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 108 వాహనాలు 22 ఉండగా, 81 మంది, తూర్పుగోదావరిలో 21 వాహనాల్లో 79, కాకినాడ జిల్లాలోని 19 వాహనాల్లో 73 మంది ఈఎంటీలు, డ్రైవర్లు ఉన్నారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ర్యాంపుల్లో ఇసుక లోడింగ్ చేసే శ్రామికులు విస్తారంగా ఉన్నారు.
పాలకుల అణచివేత
మండపేట ఫీల్డ్ అసిస్టెంట్ టి.రాజేశ్వరి తనపై రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. మార్చి 6న ఎన్నికల హామీలపై జీవోలను ఇవ్వాలంటూ విజయవాడలో ఆందోళనకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం రాజమహేంద్రవరం, కాకినాడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది. సచివాలయ ఉద్యోగులకు ఎడతెరిపి లేకుండా సర్వేలు, సంబంధం లేని శాఖల పనులు అప్పగిస్తూ వేధిస్తోంది. ఉపాధి లేదా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ కోనసీమ జిల్లాలో సుమారు 4.80 లక్షల మంది యువకులను, కాకినాడ జిల్లాలో 5,33,908, తూర్పుగోదావరి జిల్లాలో 5.09 లక్షల మంది యువకులను పది నెలలుగా మోసగిస్తోంది. కాకినాడ జిల్లాలో 12,272 మంది, కోనసీమ జిల్లాలో 9,581 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 9,117 మంది మొత్తం 30,970 వలంటీర్లను కూటమి ప్రభుత్వం దగా చేసింది. అమలాపురం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ కం కండక్టర్ డ్యూటీ చేయాలంటూ వేధించడాన్ని నిరసిస్తూ మార్చి 9న డిపోలో కార్మికులు నిరసనకు దిగారు.
శ్రామికునికి వైఎస్సార్ సీపీ దన్ను
2019 సెప్టెంబర్‌లో ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయడంతో కార్మికులకు ఎంతో మేలు జరిగింది. ఆటో కార్మికులకు, బోటు ఉన్న మత్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున, మగ్గం ఉన్న చేనేత కార్మిక కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం అందించింది. అంగన్‌వాడీలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలకు, ఆశా వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు వేతనాలను పెంచింది. మున్సిపాలిటీల్లోని కార్మికుల వేతనాలను రూ.18 వేలు చేసి వారి ఆర్థిక ప్రగతికి దోహదపడింది. ప్రతి గ్రామానికి పది మంది చొప్పున సచివాలయ ఉద్యోగాలు కల్పించింది.
‘కూటమి’పై శ్రామిక పోరాటాలిలా..
ఎన్నికల హామీ మేరకు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 5న అమలాపురంలో వలంటీర్లు ఆందోళన చేపట్టారు. ఫిబ్రవరి 18న ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట అంగన్‌వాడీలు ధర్నాలు చేశారు. ఫిబ్రవరి 28న ఆప్కాస్‌ను రద్దు చేసి మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలంటూ ఉమ్మడి జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ ఏప్రిల్ ఒకటిన అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేశారు. ఏప్రిల్ రెండున 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలంటూ మూడు జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. మార్చి 4న అమలాపురంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వాహన మిత్ర తరహా ఆర్థికసాయం కోరుతూ ధర్నా చేశారు. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలంటూ ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజుల పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమకు మద్యం షాపు కేటాయించాలంటూ జనవరి 27న రాజోలు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట కల్లుగీత కార్మికులు ధర్నా చేశారు. అదే రోజు వేతనాలు పెంచాలంటూ మూడు జిల్లాల కలెక్టరేట్ల ఎదుట వీఓఏలు ధర్నా చేపట్టారు. డెలివరీ కమీషన్‌ను పెంచాలంటూ ఏప్రిల్ 24న రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద ఎల్‌పీజీ గ్యాస్ డెలివరీ కార్మికులు ధర్నా చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని కోరుతూ అదే రోజు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మార్చి 24న స్మార్ట్ మీటర్లతో తమ పొట్ట కొట్టొద్దంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద మీటర్ రీడర్లు ధర్నా చేశారు. ఫిబ్రవరి 9న తమ వేతనాలు పెంచాలని, సీటీసీ విధానాన్ని రద్దు చేసి ఈపీఎఫ్ యాజమాన్య వాటాను యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద 104 ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో విస్తారంగా ఉత్పత్తి సృష్టి
అహర్నిశలు శ్రమిస్తున్న సంఘటిత,
అసంఘటిత కార్మికులు
సంక్షేమ సేవలందిస్తున్న ఉద్యోగులు,
కాంట్రాక్టు వర్కర్లు
ఐదు నెలలకే శ్రామిక వ్యతిరేకత
మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వం
పది నెలల్లో మిన్నంటిన నిరసనలు
నేడు శ్రామిక దినోత్సవం మే డే
ప్రపంచంలో ఎన్నో వింతలూ.. విశేషాలు. ప్రకృతి పరమైన అద్భుత సౌందర్యాలు నిస్సందేహంగా భగవంతుడి సృష్టే. కానీ.. రాయిపై రాయి పేర్చి, లోహాలను వంచి రూపొందించిన కళాత్మక ఖండాలు, అద్భుత కట్టడాలన్నింటికీ మానవ శ్రమే మూలం. కండలు కరిగించి.. రక్తాన్ని చెమటగా మార్చి.. దేశాభివృద్ధికి దిశానిర్దేశం చూపేది శ్రామికులే. వారి శ్రమ లేనిదే ఏ దేశమూ పురోగతి సాధించదనేది
జగమెరిగిన సత్యం. అందుకే శ్రమించే ప్రతిఒక్కరూ సృష్టికర్తలే.
ప్రకృతిని సృష్టించిన ఆ భగవంతుడూ ఓ శ్రమ జీవే.
శ్రామికులపై ప్రభుత్వ నిర్బంధం
కూటమి నేతలు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక శ్రామికులపైనా, ఆందోళనలపై నిర్బంధాన్ని విధిస్తోంది. ప్రభుత్వ తీరును ఐక్యంగా ప్రతిఘటిస్తాం.
– కరణం ప్రసాదరావు, కార్మిక నేత,
సీఐటీయూ, సామర్లకోట

సృష్టి కర్తా శ్రమ జీవే..

సృష్టి కర్తా శ్రమ జీవే..

సృష్టి కర్తా శ్రమ జీవే..