
కేరళలో కోనసీమ వాసి గల్లంతు
ఐ.పోలవరం: చేపల వేట ద్వారా జీవనోపాధి పొందాలని కేరళ వెళ్లిన కోనసీమ వాసి గల్లంతయ్యాడు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ళ గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన యువకుడు సంఘాని వీరబాబు పొట్ట చేత పట్టుకుని బతుకు తెరువు కోసం ఆరు నెలల క్రితం కేరళ వెళ్లాడు. అక్కడ పలు ప్రాంతాల్లో వేటాడుతూ ఊపాధి పొందుతున్నాడు. సముద్రం మీద చేపల వేట కోసం బోటు మీద వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరగగా ఇప్పటికీ వీరబాబు ఆచూకీ లభ్యం కాలేదు. బోటు సిబ్బంది, కేరళ నేవీ, కోస్టుగార్డు అధికారులు సముద్రంలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. వీరబాబుకు భార్య, ఆరు నెలల పాప, తల్లి ఉన్నారు. కుటుంబం మొత్తం అతని మీద ఆధారపడి జీవిస్తుంది. ప్రమాద విషయం తెలియడంతోపాటు ఇంత వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదని తెలిసి అతని కుటుంబం తల్లడిల్లిపోతోంది. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి వీరబాబు ఆచూకీ తెలుసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.