
సెలవులు.. వికాసానికి నెలవులు!
రాయవరం: విద్యార్థులకు ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పలువురు విద్యార్థులు వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడపడంతో పాటు, కొంత సమయాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రంథాలయాలను విద్యార్థులకు బాగా చేరువ చేశారు. విద్యార్థులను వేసవిలో గ్రంథాలయాలకు మరింత చేరువ చేసేందుకు గ్రంథాలయ శాఖ ప్రణాళిక రూపొందించింది. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి, మానసిక, శారీరక వికాసంతో పాటుగా వారిలో ఉన్న సృజనాత్మకతను పెంచుకునేందుకు ఏపీ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 నుంచి జూన్ 6వ తేదీ వరకు 45 రోజుల పాటు ఈ ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
నైపుణ్యాలు వెలికి తీసేందుకు..
వేసవి సెలవులు వృథా కాకుండా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు వివిధ గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలను గ్రంథాలయ శాఖ ఏర్పాటు చేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. కథలు వినడం, గ్రంథాలయాల్లోని పుస్తకాలు చదవడం, పుస్తక సమీక్ష, కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్, డ్యాన్స్, పప్పెట్ మేకింగ్, చెస్, క్యారమ్స్, క్విజ్ తదితర సృజనాత్మక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యాలను అభివృద్ధి పరుస్తారు. శిక్షణ అనంతరం విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేయడంతో పాటుగా, విజేతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. తల్లిదండ్రులు కూడా తమ చిన్నారులను సమ్మర్ క్యాంపులకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. విద్యార్థులు కూడా తమకు ఇష్టమైన కథల పుస్తకాలు చదవడం, తిరిగి ఆ కథలను సొంత మాటల్లో చెప్పడంతో పాటు ఆటపాటలతో ఆనందించే విధంగా లైబ్రేరియన్లు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యావేత్తలను న్యాయ నిర్ణేతలుగా వినియోగించుకుంటున్నారు.
పరిస్థితి ఇదీ..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యాన వేసవి శిక్షణ శిబిరాలను శాఖా గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యాన జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు 101 లైబ్రరీలు, 2 గ్రామీణ గ్రంథాలయాలు, 161 పుస్తక అభివద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 60 గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సగటున 1,500 మంది చిన్నారులు ఈ శిబిరాల్లో పాల్గొని విజ్ఞాన సముపార్జన చేస్తున్నారు.
ఇప్పుడిప్పుడే వస్తున్నారు
వేసవి విజ్ఞాన శిబిరాలకు చిన్నారులు రావడం ప్రారంభించారు. క్రమక్రమంగా హాజరు పెరుగుతోంది. సమ్మర్ క్యాంపు వల్ల గ్రంథాలయాల విలువను విద్యార్థులు అర్థం చేసుకుంటున్నారు. పుస్తక పఠనం అలవాటు పెరుగుతుంది.
– దడాల వెంకటరమణ,
లైబ్రేరియన్, రామచంద్రపురం
సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సమ్మర్ క్యాంపులు దోహదపడతాయి. వేసవి శిక్షణ శిబిరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అధికంగా పాల్గొంటున్నారు. తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన ఉంది.
– వీఎల్‌ఎన్ సాయి వరప్రసాద్, కార్యదర్శి,
జిల్లా గ్రంథాలయ సంస్థ, కాకినాడ
గ్రంథాలయాల్లో
విద్యార్థులకు వేసవి శిక్షణ
విజ్ఞాన శిబిరాల షెడ్యూల్ విడుదల

సెలవులు.. వికాసానికి నెలవులు!

సెలవులు.. వికాసానికి నెలవులు!