
జిల్లాలో ఓటర్ల వివరాలు (జనవరి 22వ తేదీ నాటికి )
నియోజకవర్గం పోలింగ్ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు
రామచంద్రపురం 239 99,361 1,00,785 1 2,00,147
ముమ్మిడివరం 268 1,20,680 1,21,190 0 2,41,870
అమలాపురం (ఎస్సీ) 235 1,05,166 1,05,724 1 2,10,891
రాజోలు (ఎస్సీ) 205 96,552 98,637 1 1,95,190
పి.గన్నవరం (ఎస్సీ) 212 98,969 97,363 5 1,96,337
కొత్తపేట 262 1,23,389 1,11,692 5 2,48,392
మండపేట 223 1,05,949 1,11,69 4 2,17,645
మొత్తం 1,644 7,50,066 7,60,389 17 15,10,472
సాక్షి అమలాపురం: సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టానికి తెరలేవనుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో, అసెంబ్లీలకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణకు గెజిట్ నోటిఫికేషన్ కూడా గురువారం విడుదల కానుంది.
25 వరకూ స్వీకరణ
ఈ నెల 18 నుంచి 25 వరకూ (ప్రభుత్వ సెలవులలో మినహా) ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఈ నెల 26న పరిశీలన జరుగుతుంది. 29న ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరగనున్న విషయం తెలిసిందే. జిల్లాలోని ఓటర్ల తుది జాబితాను జనవరి 22వ తేదీన ప్రకటిస్తారు. ఆ ప్రకారం ఓటర్ల వివరాలు ఈ కింద తెలిపిన విధంగా ఉన్నాయి. జనవరి 22 తర్వాత కూడా ఓటర్ల నమోదు జరిగిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎన్నో ప్రత్యేకతలు
● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టారు. గోదావరి లంకలు, సముద్ర సంగమ ప్రాంతంలో పాయల మధ్య ఉన్న గ్రామాలలో పోలింగ్ నిర్వహణపై దృష్టి సారించారు. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపైనా, నగదు, మద్యం సరఫరాపై పక్కాగా నిఘా పెట్టారు.
● నామినేషన్లను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సౌకర్యం కల్పించారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ వేసిన తర్వాత ధ్రువీకరణ పత్రాలను ఆర్వో కేంద్రంలో అందజేయాలి.
● ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో సామాన్య పౌరులను సైతం భాగస్వాములను చేస్తూ ఎన్నికల కమిషన్ పలు రకాల యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. సీవిజల్, సువిధ, అబ్జర్వర్, సాక్ష్యం, కేవైసీ, నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్, ఓటరు హెల్ప్‌యాప్‌లు రూపొందించింది. ఎన్నికలకు సంబంధించి సమాచారం, కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులకు, ఎన్నికల నియమావళి, ఓటర్లకు అవసరమైన సాయం, ఎన్నికల ఖర్చు, పోలింగ్ బూత్‌ల తదితర సమాచారాలు తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి.
● గత ఎన్నికల వరకూ ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, వాటికి ఎదురుగా అభ్యర్థుల గుర్తులు ఉండేవి. తాజాగా ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని సులువుగా గుర్తించి, ఓటు వేసేందుకు ఈ సౌకర్యం కల్పించారు.
● తొలిసారిగా ఉద్యోగులు, ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందితో పాటు పాత్రికేయులకు సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రంలో కాకుండా ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని ఈ ఎన్నికల్లో ప్రవేశ పెడుతున్నారు. 85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులకు ఇలా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇందుకోసం ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల అధికారులు సాధారణ పోలింగ్‌కు ముందే ఇంటికి వచ్చి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయిస్తారు.
● ఓటింగ్ శాతం పెంచేందుకు నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గానికి ఒకటి వంతున ఏర్పాటు చేయగా, ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గానికి ఐదు వంతున ఏర్పాటు చేయనున్నారు. ఇక మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గానికి ఒకటి వంతున మాత్రమే మహిళలకు పోలింగ్ కేంద్రం ఉండేది. ఈసారి వాటి సంఖ్యను పెంచనున్నారు.
సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టం
జిల్లాలో 15.10 లక్షల మంది ఓటర్లు
1,644 పోలింగ్ కేంద్రాలు