స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని ఆత్మహత్య

Polytechnic Student Commits Suicide As Parents Fail To Buy Smart phone  - Sakshi

జ్యోతినగర్‌(రామగుండం): ఎంతో భవిష్యత్‌ ఉన్న విద్యార్థినిని పేదరికం బలితీసుకుంది. ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదనే మనస్తాపంతో డిప్లొమా విద్యార్థిని కోక రోజా(18) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. వివరాలు..ఎనీ్టపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూపోరట్‌పల్లి గ్రామానికి చెందిన కోక రమేశ్‌–పల్లవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా చిన్న కుమార్తె రోజా(18) సిద్దిపేట జిల్లాలోని పెద్దకోడూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న దృష్ట్యా తల్లిదండ్రులను స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయమని కోరింది.

తండ్రి డీసీఎం డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫోన్‌కు డబ్బు సరైన సమయంలో అందకపోవడంతో జాప్యమైంది. దీంతో చదువుకు ఆటంకం కలుగుతుందనే మనోవేదనకు గురైంది. గురువారం ఉదయం కుటుంబసభ్యులు సమీపంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. కుమార్తె ఇంకా రావడం లేదని ఇంటికి వచ్చి చూడగా ఉరేసుకొని కనిపించింది. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేక్రమంలో మృతిచెందింది. తల్లి పల్లవి ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్సై చక్రపాణి కేసు నమోదు చేసుకున్నారు. తన మృతికి ఎవరూ కారణం కాదు..నా చావుకు నేనే కారణం అంటూ రాసిన లెటర్‌ లభ్యమైంది.

   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top