అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి.. మాయ మాటలతో లైంగిక దాడి

Molestation On Married Woman Alamuru East Godavari District - Sakshi

నిందితుడిని పట్టించిన దిశ యాప్‌ 

సాక్షి, ఆలమూరు: వివాహిత ఒంటరితనాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఒక కామాంధుడు అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి లైంగిక దాడి జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో బాధితురాలు చాకచక్యంగా ఉపయోగించిన దిశ యాప్‌ నిందితుడిని పట్టించింది. ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల మధ్య జరిగిన ఈ ఘటన వివరాలను రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి స్థానిక పోలీసు స్టేషన్‌లో  బుధవారం వెల్లడించారు. మండపేటకు చెందిన వివాహిత తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా కొన్ని నెలలుగా అదే పట్టణంలో అమ్మగారి ఇంటి వద్ద ఉంటోంది.

కుటుంబ సభ్యులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తన కుటుంబానికి సన్నిహితుడైన కపిలేశ్వరపురం మండలం వడ్లమూరుకు చెందిన అంగర వీర్రాఘవులను అద్దె ఇల్లు చూస్తే వేరేగా ఉంటానని చెప్పింది. ఈ నెల 22 రాత్రి బాధితురాలికి అద్దె ఇల్లు చూపిస్తానని చెప్పి రాఘవులు తన బైక్‌పై జొన్నాడ తీసుకువచ్చి బాగా పొద్దు పోయే వరకూ పలు ప్రదేశాలకు తిప్పాడు. మాయ మాటలతో మభ్యపెట్టి జొన్నాడలోని తన స్నేహితుడి ఇంటి వద్ద ఈ రాత్రి ఉండి ఉదయం వెళదామని నమ్మబలికాడు. అక్కడ నుంచి ఆమెను వెదురుమూడికి చెందిన దుర్గాప్రసాద్‌ సహకారంతో వడ్లమూరులోని తన నివాసానికి తీసుకుపోయి లైంగిక దాడి జరిపాడు. 

చదవండి: (పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు)

దిశ యాప్‌ను ఆశ్రయించిన బాధితురాలు 
లైంగిక దాడితో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు తన మొబైల్‌ నుంచి దిశ యాప్‌ ద్వారా కాల్‌ చేయడంతో పోలీసులకు సమాచారం అందింది. విషయం గ్రహించిన నిందితుడు రాఘవులు ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని స్విచాఫ్‌ చేయడంతో సిగ్నల్‌ కట్‌ అయింది. అప్పటికే దిశ యాప్‌ ద్వారా సమాచారం అందుకున్న మండపేట రూరల్‌ సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఆలమూరు ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ దర్యాప్తు చేపట్టారు. మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్న సమాచారంతో అక్కడకు వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. బుధవారం తెల్లవారుజామున నిందితులిద్దరినీ వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని ఆలమూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సీఐ శివగణేష్‌, ఎస్సై శివప్రసాద్‌ను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని రక్షణ పొందాలని ఆయన సూచించారు.   

చదవండి: (విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top