యూట్యూబ్‌లో పరిచయం.. పక్కా స్కెచ్‌.. భార్య, అత్తలను..

Husband Assassinate His Wife In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 18న జరిగిన తల్లీకూతుళ్ల జంటహత్యల మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మంచిర్యాలకు చెందిన తల్లీకూతురు విజయలక్ష్మి, రవీనాలను రవీనా భర్త అరుణ్‌కుమార్‌ యూట్యూబ్‌ ద్వారా పరిచయమైన ఇద్దరు వ్యక్తులతో కలిసి హత్యచేశాడు. మంగళవారం స్థానిక డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.  

పబ్జీ గేమ్‌తో ప్రేమ.. పెళ్లి..
నిజామాబాద్‌ జిల్లా శక్కర్‌నగర్‌కు చెందిన కాలేరు అరుణ్‌కుమార్‌ పబ్జీ గేమ్‌ ఆడుతుండగా మంచిర్యాలకు చెందిన పూదారి రవీనా(26)తో 2019 సెప్టెంబర్‌లో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ఫేస్‌బుక్, వాట్సాప్‌ చాటింగ్‌ వరకు వెళ్లి అనంతరం ప్రేమ... ఆ తర్వాత పెళ్లికి దారితీసింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే 2020 జూన్‌ 11న వివాహం జరిగింది. కొద్ది నెలలకు రవీనా గర్భం దాల్చడంతో అరుణ్‌కుమార్‌ కట్నం కోసం వేధించసాగాడు. రవీనా తన తల్లి విజయలక్ష్మి(47)కి చెప్పడంతో గత ఏడాది డిసెంబర్‌ 20న ఆమె కూతురును మంచిర్యాలకు తీసుకొచ్చింది. అయినా అరుణ్‌కుమార్‌ డబ్బుల కోసం ఫోన్‌లో వేధించడంతో రవీనా మంచిర్యాల మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పలుమార్లు మహిళా పోలీస్‌స్టేషన్, సఖీ సెంటర్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయినా అరుణ్‌లో మార్పు రాకపోవడంతో కేసు నమోదు చేశారు.

అబార్షన్‌ చేయించినందుకే..
కౌన్సెలింగ్‌ సమయంలో రవీనా గర్భం విషయం ప్రస్తావనకు వచ్చింది. రవీనా తల్లి విజయలక్ష్మి తన భార్యకు అబార్షన్‌ చేయించిందని, వారిద్దరిని చంపేస్తానంటూ బెదిరించాడు. అప్పటి నుంచి రవీనా, వి జయలక్ష్మీలపై సోషల్‌ మీడియాలో, తనకు తెలిసిన వారికి, బంధువులకు వారి ప్రవర్తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. దీనిపై విజయలక్ష్మి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అరుణ్‌పై మరో కేసు పెట్టింది. 

బిట్టు, సుబ్బు, అరుణ్‌ల నేరచరిత్ర.. 
ఈ కేసులోని నిందితులకు ఇదివరకే నేర చరిత్ర ఉంది. గుంటూర్‌ జిల్లా వైకుంటపురానికి చెందిన జుజ్జవరపు రోషయ్య ఉరఫ్‌ బిట్టు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు తీసుకొని చాలమందిని మోసం చేశాడు. పందెంకోళ్లు ఆడించేవాడు. గుంటూర్‌ జిల్లా తెనాలికి చెందిన దండం వెంకటసుబ్బరావ్‌(సుబ్బు) ఓ మహిళ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అరుణ్‌పై గతంలో అమ్మాయిలను వేధించిన రెండు కేసులు నిజామాబాద్‌లో నమోదయ్యాయి.  

అరుణ్‌ ఓ రోజు సెల్‌ఫోన్‌లో యూట్యూబ్‌ చూస్తున్న క్రమంలో ఓ న్యూస్‌ చానల్‌లో గన్‌కల్చర్‌ కార్యక్రమాన్ని చూస్తుండగా కామెంట్‌ బాక్స్‌లో ఒక వ్యక్తి సుపీరియర్‌ కిల్లర్‌ విజయవాడ అనే ఐడీతో వీ సేల్‌ వెపన్స్‌ అండ్‌ మర్డర్, అండ్‌ కిడ్నాప్‌అని ఒక ఇంటర్‌నేషనల్‌ నంబర్‌ ఉంచాడు. దీంతో అరుణ్‌ ఆ నంబరుకు వాట్సాప్‌ కాల్‌ చేసి మాట్లాడగా అవతలి వ్యక్తి తాను గుంటూరుకు చెందిన బిట్టుగా పరిచయం చేసుకున్నాడు. తన భార్య, అత్తమ్మను హత్య చేయాలని అరుణ్‌ చెప్పగా.. రూ.10లక్షలు ఇస్తే హత్య చేస్తానని, ముందుగా రూ.2లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడు. తన వద్ద అంత డబ్బు లేదని, అత్తమ్మ ఇంట్లో 20 తులాల బంగారం, రూ.4లక్షల నగదు ఉంటుందని నమ్మించాడు.

దీంతో బిట్టు తనకు ఆన్‌లైన్‌లో పరిచయం ఉన్న తెనాలికి చెందిన సుబ్బుతో వచ్చి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 15న అరుణ్, బిట్టు మాట్లాడుకుని మంచిర్యాలకు వచ్చేందుకు రైలు రిజర్వేషన్‌ కోసం అరుణ్‌ రూ.1200 పేటీఎం చేశాడు. 17న బిట్టు, సుబ్బు మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉదయం 10:30 గంటలకు దిగారు. ముగ్గురూ కలుసుకుని స్థానిక లాడ్జిలో గది అద్దెకు తీసుకుని మందుతో విందు చేసుకుని సాయంత్రం రెక్కీ నిర్వహించారు. హత్యకు అవసరమైన తాడు, హ్యాండ్‌గ్లౌస్‌ కొనుగోలు చేసి లాడ్జికి చేరుకొని రాత్రి హత్యకు పథకం వేశారు. తెల్లవారు జామున విజయలక్ష్మి నల్లా నీటి కోసం బయటకు రాగా.. ఆమె వెనకాలే ఇంట్లోకి వెళ్లిన బిట్టు, సుబ్బు ఆమెపై దాడి చేసి మెడకు తాడు బిగించి హత్య చేశారని సీపీ వివరించారు.

రవీనా అరిచే ప్రయత్నం చేయగా అరుణ్‌ ఆమెపై దాడి చేసి గొంతు నొక్కాడు. బిట్టు, సుబ్బు అదే తాడుతో రవీనా మెడకు బిగించి హత్యచేశారని తెలిపారు. ఇంట్లో డబ్బులు, బంగారం లభించకపోవడంతో ల్యాప్‌టాప్‌తో బుల్లెట్‌పై హైదరాబాద్‌ వైపు పారిపోయారు. షామీర్‌పేట వద్ద ఆగి ఒప్పందం ప్రకారం రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 26 నుంచి 28లోపు విజయవాడకు వచ్చి డబ్బులు ఇవ్వాలని బిట్టు అరుణ్‌కు అడ్రస్‌ చెప్పాడు. నిందితులను అరెస్టు చేయడంలో కృషి చేసిన ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ను సీపీ అభినందించారు.

చదవండి:  భార్య వేధింపులు తాళలేక ‘భర్త ఆత్మహత్య’.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top