స్విగ్గీ డెలివరీ బాయ్‌ని చితకబాది.. నగదు చోరీ

Bengaluru Swiggy Delivery Boy Assaulted By 4 Customers For Denying Free Food - Sakshi

బెంగళూరులో చోటు చేసుకున్న ఘటన

డెలివరీ బాయ్‌ను చితకబాది.. దొంగతనం చేసి రోడ్డు మీద పడేశారు

డెలివరీ బాయ్‌కు మద్దతిస్తున్న నెటిజనులు 

బెంగళూరు: జొమాటో డెలివరీ బాయ్‌ సంఘటన మరువక ముందే కర్ణాటకలో అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. ఈ సారి బాధితుడు స్విగ్గీ డెలివరీ బాయ్‌. ఉచితంగా భోజనం ఇవ్వనన్నందుకు స్విగ్గీ డెలివరీ బాయ్‌ని నలుగురు యువకులు దారుణంగా చితకబాదారు. మే 28న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కార్తీక్‌ హరిప్రసాద్‌(25) అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28న సాయంత్రం 4 గంటలకు రాజాజీనగర్‌ నుంచి ఒక ఆర్డర్‌ వచ్చింది. ఈ క్రమంలో కార్తీక్‌ వారు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ తీసుకుని డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే ఆర్డర్‌ చేశాక సదరు వ్యక్తులు దాన్ని క్యాన్సిల్‌ చేయడానికి ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. 

ఇక కార్తీక్‌ ఫుడ్‌ తీసుకెళ్లి వారికి ఇచ్చి.. డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. కానీ వారు తాము ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేశామని.. ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే కార్తీక్‌ అందుకు ఒప్పుకోలేదు. ఈ ఆహారాన్ని బయట ఆకలితో ఉన్న వారికి ఇస్తానని తెలిపాడు. ఈ క్రమంలో కార్తీక్‌కు, ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన వారికి మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో నిందితులు కార్తీక్‌ను చితకబాది.. అతడి చేతిలో నుంచి మొబైల్‌, హెల్మెట్‌ లాక్కుని విసిరేశారు. ఆ తర్వాత అతడి వాలెట్‌ నుంచి 1800 రూపాయలు దొంగతనం చేశారు. కార్తీక్‌ తలపై రాళ్లతో కొట్టి.. రోడ్డు మీద పడేసి అక్కడ నుంచి పారిపోయారు. 

కార్తీక్‌ అదృష్టం కొద్ది వేరే డెలవరీ బాయ్స్‌ అతడిని గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్‌ స్నేహితుడు ఒకరు జరిగిన సంఘటన గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. చాలా మంది నెటిజనులు కార్తీక్‌కు ధన సహాయం చేయడానిక ముందుకు వచ్చారు. ఈ సమయంలో తనకు మగాది రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ చాలా సాయం చేశాడని.. తనతో నిరంతరం టచ్‌లో ఉన్నాడని తెలిపాడు. ఇక త్వరలోనే బెంగళూరుకు వచ్చి.. తన మీద దాడి చేసిన కస్టమర్ల మీద ఫిర్యాదు చేస్తానని తెలిపాడు కార్తీక్‌. స్విగ్గీ కంపెనీ సదరు కస్టమర్ల వివరాలు పోలీసులకు అందజేస్తుందన్నాడు. ఇక కంపెనీ, పోలీసులు తనకు మద్దతుగా నిలిచారని తెలిపాడు కార్తీక్‌.

చదవండి: 
ఆన్‌లైన్‌ మోసం.. బ్లూటూత్‌ బుక్‌ చేస్తే... 
స్విగ్గీ ఆర్డర్‌..ఇల్లు దోచేశారు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top