అంతర్యుద్ధం! | - | Sakshi
Sakshi News home page

అంతర్యుద్ధం!

Mar 27 2026 8:52 AM | Updated on Mar 27 2026 8:52 AM

జూనియర్లు, సీనియర్ల మధ్య ఢీ అంటే ఢీ డీఎంహెచ్‌ఓ బదిలీతో జూనియర్లకు గుబులు 14 నెలల అవినీతిని బయటపెట్టేందుకు సంసిద్ధమైన సీనియర్లు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వర్గపోరు తార స్థాయికి చేరింది. జూనియర్లు, సీనియర్ల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఇన్నాళ్లు రేసుగుర్రంలా వ్యవహరించిన వారికి డీఎంహెచ్‌ఓ బదిలీ షాక్‌ ఇచ్చింది. 14 నెలల కాలంలో కార్యాలయంలో జరిగిన అవినీతి బాగోతాన్ని బయటపెట్టేందుకు సీనియర్లు సిద్ధమవుతుండగా.. జూనియర్లు తమపై విచారణ తప్పదేమోనన్న ఆందోళనలో మునిగిపోయినట్టు తెలుస్తోంది.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కార్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. ఇన్నాళ్లుగా నిశ్శబ్దంగా కొనసాగిన సీనియర్లు – జూనియర్ల మధ్య కోల్డ్‌వార్‌ తాజాగా వీధికెక్కింది. నాలుగు గోడల మధ్య నలిగిన సీనియర్లు డీఎంహెచ్‌ఓ బదిలీతో ఊపిరి పీల్చుకున్నట్టయింది.

బదిలీతో మారిన సమీకరణాలు

ఇటీవల డీఎంహెచ్‌ఓ బదిలీతో కార్యాలయంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్ప టివరకు మౌనం పాటించిన సీనియర్లు ఇప్పుడు ముందుకొచ్చి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ‘ఇన్నా ళ్లు ఒత్తిడితో మౌనం పాటించాం... ఇక నిజాలు బయటపెడతాం’ అంటూ తెగేసి చెబుతున్నారు. గత 14 నెలల కాలంలో జరిగిన ప్రతి అంశాన్ని పరిశీలించి, అవినీతి అక్రమాలు బయటపెడతామని బహిరంగంగా చెబుతున్నారు. అవసరమైతే పూర్తి ఆధారాలతో రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నిధుల దుర్వినియోగం, తప్పుడు బిల్లులు, అక్రమ డెప్యూటేషన్లు వంటి అంశాలపై పూర్తి వివరాలతో ఉన్న నివేదికను ఉన్నతాధికారులకు అందజేయాల ని నిర్ణయించారు.

నిధుల వినియోగంపై అనుమానాలు

జిల్లాలో అమలు చేసిన పలు ఆరోగ్య కార్యక్రమా లకు సంబంధించిన నిధుల వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖర్చుల విషయంలో పారదర్శకత పాటించలేదని, లెక్కల్లో తేడాలు ఉన్నాయని సీనియర్లు ఆరోపిస్తున్నారు. తప్పుడు బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్ము మింగేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో పెద్ద ఎత్తున గోల్‌ మాల్‌ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు అధికారుల ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇష్టానుసారంగా డెప్యూటేషన్లు

కార్యాలయంలో నియామకాలు, డెప్యూటేషన్లు కూడా వివాదాస్పదంగా మారాయి. నిబంధనలు పక్కనబెట్టి, కొంతమందికి అనుకూలంగా పోస్టింగులు ఇచ్చారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. రూ.50వేల నుంచి రూ.3 లక్షల వరకు మామూళ్లు తీసుకుని బదిలీలు చేశారనే ఫిర్యాదులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు వెళ్లినట్లు సమాచారం. 40 మందికిపైగా బదిలీలపై ఉన్నారని, నిబంధనల ప్రకారం డెప్యూటేషన్లు లేవని ఆ శాఖ అధికారులు కోడై కూస్తున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వర్గపోరు

అసలు అధికారమంతా ఒకరిదే?

డీఎంహెచ్‌ఓగా సుధారాణి బాధ్యతలు స్వీకరణ తర్వాత పలు మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత అప్పటి వరకు ఉన్న ఫోగ్రాం ఆఫీసర్ల కుర్చీలను ఖాళీ చేయించారు. వారి స్థానంలో వైద్య వ్యవస్థలో ఓనమాలు నేర్చుకుంటున్న జూనియర్లకు ఫోగ్రాం ఆఫీసర్లుగా పగ్గాలు కట్టబెట్టారు. కానీ వారి చేతుల్లో అసలు అధికారాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలక నిర్ణయాలు, ఫైళ్ల కదలికలు, నిధుల ఆమోదాలు అన్నీ ఒకే అధికారి ఆధీనంలో జరిగాయని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ‘పేరుకే పోస్టులు... కానీ అధికారమంతా ఒకరే వినియోగించారు’ అని సీనియర్‌ వర్గం అంటోంది.

తోకముడిచిన జూనియర్లు?

మరోవైపు, పరిస్థితులు మారడంతో జూనియర్‌ వర్గం రక్షణాత్మకంగా మారినట్లు తెలుస్తోంది. డీఎంహెచ్‌ఓ బదిలీ ప్రభావంతో తమపై విచారణ జరిగే అవకాశం ఉందన్న భయంతో వారు మౌనం వహిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారం త్వరలోనే పెద్ద వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. అధి కారిక విచారణ ప్రారంభమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement