నాగలాపురం: మండలంలోని టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో సూర్యపూజోత్సవంలో భాగంగా మూడోరోజైన గురువారం రవి కిరణాలు గర్భాలయంలోని స్వామివారి నాభిని తాకాయి.
ఆలయ అర్చకులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. పరివార దేవతలకు అభిషేకాలు, విశేష పూజలు చేసి భక్తుల సర్వదర్శనం కల్పించారు. అనంతరం ఉదయం 10 గంటలకు సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారికి అమ్మవారి మండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవ నిర్వహించి, దూపదీప నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు సూర్య భగవానుడు అస్తమించే సమయంలో రవికిరణాలు మెల్లమెల్లగా ఆలయ ప్రధాన గోపురం నుంచి గర్భాలయంలోని స్వామి వారి నాభిని తాకాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు పులకించారు. అనంతరం సూర్యుని కిరణాలు పయనించిన మార్గాన్ని ఆలయ పరిచారకులు పుణ్యజలంతో అభిషేకించారు. భక్తుల గోవింద నామస్మరణలతోఅలయం మారుమోగింది.
తెప్పపై విహరిస్తున్న కోదండరాముడు
కిరణాలను వీక్షించడానికి పోటెత్తిన భక్తులు
తిరుచ్చిపై ఊరేగుతున్న కోదండరాముడు
తెప్పోత్సవం
సూర్యపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురు వారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అనంతరం పుష్కరిణిలో తెప్పపై కొలువు దీర్చారు. అనంతరం స్వామివారు మూడు సార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేదపండితులు వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ మునిశంకరయ్య, స్పెషల్ ఆఫీసర్ గోవిందరాజులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


