ఇలలో వైభోగం.. సీతారాముల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

ఇలలో వైభోగం.. సీతారాముల కల్యాణం

Mar 27 2026 8:52 AM | Updated on Mar 27 2026 8:52 AM

● శాస్త్రోక్తంగా ఉదయం 9 గంటలకు శ్రీసీతారాముల కల్యాణం ● ఉదయం 8 గంటలకు గ్రామోత్సవం ● ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం, 12 గంటలకు విందు ● రాత్రి 7 గంటలకు హనుమంతుని శ్రీ సీతారామలక్ష్మణుల విహారం

తుమ్మలగుంటలో సీతారాముల కల్యాణానికి భారీ ఏర్పాట్లు

వేద మంత్రాలు.. మంగళవాయిద్యాలు మోగుతుండగా సిగ్గుతో తలదించుకుని ముసి ముసి నవ్వుల సీతమ్మ మెడలో రామయ్య తాళి కట్టే కమనీయ ఘట్టం ఇలలో జరిగే వైభోగం.. అలాంటి సుందర, కమనీయ కావ్యం శనివారం తుమ్మలగుంట కల్యాణ వెంకన్న ఆలయంలో నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి.

తిరుపతి రూరల్‌: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తుమ్మల గుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద సీతారాము ల కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం 9 గంటల నుంచి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులతోపాటు వందలాది మంది భక్తులు పాల్గొనే కల్యాణోత్సవంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు కల్పించారు.

11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం

శ్రీసీతారాముల కల్యాణోత్సవం ముగిసిన తరువాత ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆలయం వద్ద జరిగే శ్రీరామ నవమి మహోత్సవాల్లో పాల్గొనే భక్తులందరికీ చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల నుంచి సీతాసమేత రామ లక్ష్మణులు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

ఆకట్టుకునేలా పుష్పాలంకరణ

కల్యాణ వేంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయంతో పాటు గర్భాలయం లోపల, బయట వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. కల్యాణ వేదికను సుగంధభరిత పుష్పాలు, పత్రాలతో ముస్తాబు చేశారు.

సీతారాముల కల్యాణం వీక్షించండి

భక్తాదులందరూ తుమ్మలగుంటకు వచ్చి కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆహ్వానించారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణం, శ్రీరాముని పట్టాభిషేకం మహోత్సవాలను తిలకించి పునీతులు కావాలని కోరారు. ఆలయం వద్ద జరిగే శ్రీరామనవమి మహోత్సవాలకు వచ్చే భక్తులందరికీ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement