పూతలపట్టు(యాదమరి): నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ణానం ఎంతో అవసరమని, నూతన ఆవిష్కరణలతోనే సమాజానికి మేలు జరుగుతుందని అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్రపడాల్ తెలిపారు. గురువారం ముత్తిరేవుల సమీపంలోని ఎస్వీసెట్ కళాశాలలో నిర్వహించిన హాకథాన్ 26 కార్యక్రమానికి ఆయనతో పాటు డిప్యూటీ కలెక్టర్ సురేష్ అతిథులుగా హాజరై ప్రసంగించారు. అనంతరం పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా అదే కళాశాలకు చెందిన చందుప్రియ బృందానికి రూ.లక్ష , రెండో విజేతకు రూ.50వే లు, మూడో విజేతకు రూ.25వేలు నగదు బహుమతి అందజేశారు. కళాశాల వైస్ చైర్మన్ రావూరి శ్రీనివాస్, ప్రిన్సిపల్ మోహన్‌బాబు, విభాగాధిపతి విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
వ్యవస్థాపకత నైపుణ్యాలపై శిక్షణ
తిరుపతి సిటీ: ఎస్వీయూ హోమ్‌సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రూసా 2.0 సహకారంతో ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్ విద్యార్థులకు వ్యవస్థాపకత నైపుణ్యాలు, ఫైర్ స్టార్టర్ అనే అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం వర్సిటీలో జరిగిన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి వీసీ టాటా నర్సింగరావు ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగకరమని, వర్సిటీ విద్యార్థుల ఉన్నతికి అన్ని విధాల ప్రోత్సహిస్తుందని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ విజయ్ మాథూర్, రూసా సీఈఓ వంశీ, కన్వీనర్ ప్రొఫెసర్ సుచరిత, అధ్యాపకులు ఆర్కే అనురాధ, బి స్వరూపారాణి, కే అనురాధ పాల్గొన్నారు.


