సర్వే చేయకుండానే మామిడి మొక్కలు తొలగించారు
చౌడేపల్లె: రెవెన్యూ అధికారులు తమ పొలాల్లో సర్వే చేయకుండానే మామిడి మొక్కలు తొలగించారని వెంగళపల్లె పంచాయతీ దాసరయ్యగారిపల్లెకు చెందిన రైతులు వాపోయారు. బాధితుల కథనం మేరకు.. వెంగళపల్లె పంచాయతీ దాసరయ్యగారిపల్లె సమీపంలో రామకృష్ణ పేరిట 1234/2బి, 1235/3బి 1.21 ఎకరాలు, చిన్నవెంకటస్వామి పేరిట 1234/2ఏ, 1235/3ఏ సర్వే నంబర్లలో 1.21 ఎకరాల భూమికి అధికారులు పట్టాలిచ్చారు. వారు అందులో పంటలు సాగుచేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం అధికారులు సర్వే నంబరు 65లో 1.30 ఎకరాల భూమి వంకపొరంబోకు భూమిగా పేర్కొని హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. అంతటితో ఆగక రెండేళ్ల క్రితం నాటిన మామిడి మొక్కలు తొలగించారు. దీనిపై బాధిత రైతు గంగాధర్ శుక్రవారం విలేకరులతో తన గోడు వెల్లబోసుకున్నాడు. తమ పొలం పక్కన సర్వే నంబరు 65 ఎలా వస్తుందని ప్రశ్నించాడు. సర్వే చేయకుండానే వంక పొరంబోకు భూమి వుందని పేర్కొని ఏకపక్షంగా మామిడి మొక్కలు తొలగించారని వాపోయాడు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నాడు. వెంగళపల్లె నుంచి లక్ష్మీ నరసింహస్వామి కొండ వరకు వంక పొరంబోకు భూమి ఆక్రమణకు గురైందని, అధికారులు పారదర్శకంగా సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశాడు.


