అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలిగా లలిత
చిత్తూరు కలెక్టరేట్ : అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా లలిత, షకీలాను ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీ యూనియన్ మహాసభలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే పలు తీర్మానాలు చేసినట్లు సీఐటీయూ నాయకులు వాడ గంగరాజు, గిరిధర్ గుప్తా వెల్లడించారు. ఏపీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా కోశాధికారిగా విజయ, ఉపాధ్యక్షురాలుగా ప్రమీల, లీలావతి, మమత, సుజని, కార్యదర్శులుగా పద్మ, ధన కోటి, అనితతో పాటు 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వాడ గంగరాజు మాట్లాడుతూ అంగన్‌వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుతీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.


