
డబ్బులు కాసే చెట్టు!
● మహోగని సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు ● జిల్లాలో ప్రస్తుతం 150 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు ● 12 ఏళ్లకు కోత.. ఆదాయం రూ.కోట్లలో..
విజయపురం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలువురు రైతులు వినూత్నంగా మహోగని చెట్ల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 150 ఎకరాలకు పైగా మహోగని సాగు చేపట్టారు. విజయపురం మండలంలో 12 ఎకరాలు, నగరి–7, సత్యవేడు–13, చిన్నగొట్టిగల్లు–10, ఎర్రవారిపాళెం–10 ఎకరాలు ప్రస్తుం సాగులో ఉన్నాయి. ఈ చెట్లు గోధుమ రంగు కలపతో విశిష్టంగా ఉంటాయి. మహోగనికి చెందిన కలప, ఆకులు, గింజలు మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ చెట్టు చెక్కతో ఓడలు, ఫ్లైవుడ్, ఆభరణాలు వంటి వస్తువులను తయారు చేస్తారు. అలాగే సంగీత వాయిద్యాలు, విగ్రహాల తయారీలోను వాడతారు.
సారవంతమైన నేల అవసరం
మహోగని వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి. కాబట్టి కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిని అన్ని రకాల భూముల్లో పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. మహోగని చెట్లు పెరగడానికి సారవంతమైన నేల అవసరం. బలమైన గాలులు వీచే చోట ఈ చెట్లను నాటకూడదు.
ఎకరాకు రూ. 50వేల వ్యయం
ఎకరా పొలంలో 120 మహోగని మొక్కలు నాటుకోవచ్చు. ఒక మొక్క రూ. 400న ఉంచి 450 వరకు ధర పలుకుతుంది. ఈ విధంగా ఎకరాలో నాటేందుకు రూ. 45వేలు నుంచి 55వేలు వెచ్చించాల్సి వస్తుంది. మహోగని చెట్టు పరిపక్వం చెందేందుకు 12 ఏళ్లు పడుతుంది. అయితే 5 ఏళ్లకు ఒకసారి విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక కేజీ మహాగని విత్తనం ధర మార్కెట్‌లో రూ. 1,000. ఈ విధంగా కూడా రైతుకు ఆదాయం ఉంటుంది. అలాగే మహోగని చెట్టు 60 నుంచి 80 అడుగుల వరకు పెరుగుతుంది. ఒక క్యూబిక్ ఫీట్ రూ. 1,500 నుంచి 2,500 వరకు రేటు ఉంది. ఇలా ఒక మహోగని చెట్టుకు రూ. 80 నుంచి 1.20లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఒక ఎకరంలో 120 మహోగని చెట్లను నాటడం ద్వారా 12 ఏళ్లలో రూ.కోటి వరకు ఆదాయం పొందవచ్చు.
ఆరోగ్యానికి సైతం..
మహోగని చెట్టుకు మరో ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది. మహోగని చెట్టు దగ్గర దోమలు కూడా చేరవు. దీని ఆకులు, విత్తనాలను దోమల నివారణతోపాటు క్రిమిసంహారకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే రంగులు, వార్నిష్‌లు, సబ్బులతోపాటు మందుల తయారీకి వినియోగిస్తారు. ఈ చెట్టు బెరడు నుంచి అనేక ఔషధాలను కూడా సిద్ధం చేస్తారు.
మూడు ఎకరాల్లో సాగు
నేను మూడు ఎకరాల్లో మహోగని చెట్లు సాగు చేస్తున్నా. మా మిత్రుడు కూడా ఇదే సాగు చేస్తున్నాడు. ముందు ఆయన సలహా మేరకే నేను కూడా ఇందులో దిగాను. 12 ఏళ్ల తర్వాత అధిక ఆదాయం ఉంటుందని తెలిసింది. కాకపోతే ఓపిక ఉండాలి. కొత్తరకం చెట్టు కాబట్టి మంచి ఆదాయం ఇస్తుందని ఎదురుచూస్తున్నా.
– శేఖర్‌రాజు, కోసలనగరం.
విజయపురం మండలం