కాబోయే సీఎం విజయ్‌ దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్‌ కారు.. | TVK chief Vijay luxury electric car BMW i7 This EV Range is Not Ordinary | Sakshi
Sakshi News home page

కాబోయే సీఎం విజయ్‌ దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్‌ కారు..

May 8 2026 7:21 PM | Updated on May 8 2026 8:00 PM

TVK chief Vijay luxury electric car BMW i7 This EV Range is Not Ordinary

తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన 'దళపతి' విజయ్ (TVK chief Vijay), తన రాజకీయ ప్రస్థానాన్ని ఎంత వేగంగా కొనసాగిస్తున్నారో, ఆయన ప్రయాణించే వాహనం కూడా అంతే వేగవంతమైనది, విలాసవంతమైనది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించి రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ క్రమంలో జీవనశైలి, ఆస్తుల గురించి ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

టీవీకే అధినేత విజయ్, ఇటీవల తన రాజకీయ కార్యక్రమాలకు జర్మన్ లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూకి చెందిన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ సెడాన్ బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7)ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పర్యావరణ హితంతో పాటు రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ కారు ధర భారత మార్కెట్లో సుమారు రూ. 2.05 కోట్లు (ఎక్స్-షోరూమ్).

రూ. 624 కోట్ల సామ్రాజ్యం
ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం, విజయ్ ఆస్తుల విలువ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన మొత్తం నికర ఆస్తులు రూ. 624 కోట్లు. ఇందులో చరాస్తులు రూ. 404 కోట్లు, స్థిరాస్తులు రూ. 220 కోట్లు. విజయ్‌ గ్యారేజీలో ఈ బీఎండబ్ల్యూ ఐ7 తో పాటు లగ్జరీ ఎస్‌యూవీ లెక్సస్ 350, హై-ఎండ్ ఎంపీవీ టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి.

చక్రాల మీద నడిచే విలాసం
ఈ కారు కేవలం ప్రయాణానికే కాదు, ఒక కదిలే లగ్జరీ ఆఫీసులాంటి సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు ఇవే..
థియేటర్ ఎక్స్‌పీరియన్స్:  వెనుక సీట్లో కూర్చునే వారి కోసం 31.3-అంగుళాల భారీ 8K రిజల్యూషన్ గల 'బీఎండబ్ల్యూ థియేటర్ స్క్రీన్' ఉంటుంది.
లాంజ్ సెట్టింగ్: ఎగ్జిక్యూటివ్ లాంజ్ సీటింగ్ ప్యాకేజీతో మసాజ్ ఫంక్షన్, వెంటిలేషన్ సౌకర్యం ఉంది. సుదీర్ఘ రాజకీయ పర్యటనల్లో అలసట తెలియకుండా ఇది సహాయపడుతుంది.
డిజిటల్ టెక్నాలజీ: స్మార్ట్‌ఫోన్ ద్వారానే పార్కింగ్ చేసే ఫీచర్, డిజిటల్ కీ ప్లస్, అత్యుత్తమ కనెక్టెడ్ టెక్నాలజీ ఇందులో ఉన్నాయి.

పనితీరులో 'సూపర్ ఫాస్ట్'
విజయ్ వాడుతున్న ఈ ఎలక్ట్రిక్ సెడాన్ వేగంలోనూ రారాజే. 
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 603 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
పవర్: ఇది 449 బీహెచ్‌పీ శక్తిని, 650 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
పికప్: కేవలం 4.7 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఛార్జింగ్: హై-పవర్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 34 నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు బ్యాటరీ నిండుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement