భారీగా పెరిగిన వాణిజ్యలోటు!

Trade deficit Reached Highs - Sakshi

2021 సెప్టెంబర్‌లో     22.59 బిలియన్‌ డాలర్లు

గత ఏడాది ఇదే నెలలో  కేవలం 2.96 బిలియన్‌ డాలర్లు  

న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు సెప్టెంబర్‌లో భారీగా పెరిగింది. 22.63 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ లోటు 2.96 బిలియన్‌ డాలర్లు. ఎకానమీ రికవరీ, క్రియాశీలతకు వాణిజ్యలోటు పెరుగుదల సంకేతంగా భావించవచ్చని కొందరు ఆర్థికవ్తేతలు భావిస్తుండగా, వాణిజ్యలోటు భారీగా పెరిగిపోవడమూ మంచిదికాదని మరికొందరి వాదన. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం గణాంకాలను విడుదల చేసింది.  

ఎగుమతులు–దిగుమతులు ఇలా... 
సెప్టెంబర్‌లో ఎగుమతులు 2020 ఇదే నెలతో పోల్చి 22.63 శాతం పెరిగి 33.79 డాలర్లుగా నమోదయ్యింది. ఇక దిగుమతుల విలువ 84.77 శాతం పెరిగి 56.39 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 22.60 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 
బంగారం దిగుమతులు 2020 సెప్టెంబర్‌లో 601 మిలియన్‌ డాలర్లయితే, 2021 ఇదే నెల్లో 5.11 బిలియన్‌ డాలర్లకు చేరింది.  

- చమురు దిగుమతుల విలువ 5.83 బిలియన్‌ డాలర్ల నుంచి 17.44 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.  

- సెప్టెంబర్‌లో సానుకూల వృద్ధిని నమోదు చేసిన ఎగుమతి రంగాలలో కాఫీ, జీడిపప్పు, పెట్రోలియం ఉత్పత్తులు, చేనేత, ఇంజనీరింగ్, రసాయ నాలు,  తయారీ నూలు–దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, ప్లాస్టిక్, సముద్ర ఉత్పత్తులు ఉన్నాయి. 

ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య.. 
ఇక ఎగుమతుల విలువ 2020 ఇదే కాలంతో పోల్చితే 57.53 శాతం పెరుగుదలతో 125.62 బిలియన్‌ డాలర్ల నుంచి 197.89 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు విలువ 81.67 శాతం ఎగసి 151.94 బిలియన్‌ డాలర్ల నుంచి 276 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. వెరసి వాణిజ్యలోటు 26.31 బిలియన్‌ డాలర్ల నుంచి 78.13 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య చమురు దిగుమతుల విలువ గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, 32.01 డాలర్ల నుంచి 72.99 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఈ లక్ష్యాలు సాధించగల విశ్వాసాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ వ్యక్తం చేస్తున్నారు.

పలు దేశాలతో ఎఫ్‌టీఏ చర్చలు: గోయెల్‌
ఇదిలావుండగా, బ్రిటన్, యూరోపి యన్‌ యూనియన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్, ఆస్ట్రేలియాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) భారత్‌ కీలక చర్చలు జరుపుతున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయెల్‌ గురువారం పేర్కొన్నారు. మరో రెండు దేశాలు భారత్‌లో ఎఫ్‌టీఏకు అంగీకరించాయని కూడా వెల్లడించారు. అయితే ఆ దేశాల పేర్లను మంత్రి వెల్లడించలేదు. ఈ ఒప్పందం కింద సంబంధిత  రెండు దేశాలూ తమ మధ్య వస్తు దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాలను తగ్గించుకుంటాయి లేదా పూర్తిగా ఎత్తివేస్తాయి. సేవల రంగంలో వాణిజ్యాన్ని పెంపొందించుకుంటాయి. పరస్పరం ఒకదేశంలో మరొకటి భారీగా పెట్టుబడుల ప్రణాళికలను రూపొందించుకుంటాయి.   ప్రధాని గతి శక్తి–నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మాస్టర్‌ ప్లాన్‌ (ఎన్‌ఐఎంపీ)న వల్ల పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగుతుందని పేర్కొన్నారు. స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. మౌలిక రంగంలో చక్కటి పురోగతికి ఈ ప్లాన్‌ దోహదపడుతుందని వివరించారు. చైనాతో సరిహద్దు వివాదాలో ఆ దేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చదవండి :భారత్‌లో అపార అవకాశాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top