టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ, తన కర్వ్ ఈవీలో సరికొత్తగా ‘సిరీస్ ఎక్స్’ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరను రూ.16.99 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ వద్ద) కంపెనీ నిర్ణయించింది.
ఈ సిరీస్‌లో అకంప్లిష్డ్ ఎక్స్ 55, ఎంపవర్డ్ ఎక్స్ 55 అనే రెండు వేరియంట్లను పరిచయం చేసింది. వీటిలోని 55 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఏకంగా 502 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రియల్ వరల్డ్ కండిషన్స్ లో ఈ బ్యాటరీ సుమారు 400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
లెవెల్-2 ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా, పానోరామిక్ సన్‌రూఫ్, హర్మాన్ సినిమాటిక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు బ్యాటరీపై 15 ఏళ్ల (లైఫ్–టైమ్) హెచ్‌వీ బ్యాటరీ వారంటీని టాటా మోటార్స్ అందిస్తోంది.
మిడ్-ఎస్‌యూవీ విభాగంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘సిరీస్ ఎక్స్’ శ్రేణి విడుదల చేసినట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీసీఓ వివేక్ శ్రీవత్స తెలిపారు. ఈ కారు ఐదు ఆకర్షణీయమైన రంగులతో పాటు ఐకానిక్ ‘డార్క్’ ఎడిషన్‌లోనూ లభించనుంది.


