చిన్న పెట్టుబడి.. చిగురించేనా..?

Small Companies are giving High Returns in MSME Sector - Sakshi

ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లలో వందలాది కంపెనీలు

వీటిల్లో రిస్క్‌ శాతం ఎక్కువే వెతికితే ఆణిముత్యాలూ లభిస్తాయ్‌

అందుకు అధ్యయనం, పరిశోధన తోడవ్వాలి

ఇక్కడ స్పెక్యులేషన్‌ పనికిరాదు

అర్థం చేసుకుంటేనే.. లేదంటే దూరంగా ఉండాలి

‘స్మాల్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’.. కాదని ఎవరూ అనరు. చిన్నారుల పట్ల ఎంతో శ్రద్ధ, సంరక్షణ, ముద్దు చూపిస్తాం. వారు భవిష్యత్‌ తరాలకు ప్రతిరూపాలు. అందుకే ఆ మాత్రం కేరింగ్‌ ఉంటుంది. అలాగే, విరామం అన్నది లేకుండా కష్టపడి సంపాదించుకుని, మిగుల్చుకున్న కొద్ది మొత్తంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే ముందు శ్రద్ధ అవసరం లేదా..? కచ్చితంగా ఉండాలి. చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే విషయంలోనూ ఇన్వెస్టర్లకు అంతే శ్రద్ధ, పరిశీలన, జాగ్రత్త అవసరం.

పెద్ద కంపెనీలతో పోలిస్తే.. ఒక నిర్ధేశిత కాలంలో చిన్న కంపెనీలు అధిక రాబడులు ఇస్తాయన్నది కాదనలేని నిజం. 2020 ఏప్రిల్‌ నుంచి చూసుకుంటే లార్జ్‌క్యాప్‌ కంపెనీలు నూరు శాతం వరకు రాబడులను ఇవ్వగా.. మిడ్‌క్యాప్‌ కంపెనీలు రెండు రెట్లు, అంతకంటే ఎక్కువ, స్మాల్‌క్యాప్‌లో ఐదు రెట్లు, పది రెట్ల లాభాలను కురిపించిన స్టాక్స్‌ ఎన్నో ఉన్నాయి. అందుకే  రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మందికి చిన్న కంపెనీలంటే అంత ఆకర్షణ.  

కార్పొరేట్‌ ప్రపంచంలో ఎస్‌ఎంఈలు అంటే చాలా చిన్న కంపెనీలని అర్థం చేసుకోవాలి. పెద్ద కంపెనీలతో పోలిస్తే వేగంగా ఎదిగే సామర్థ్యం వీటికి సహజంగానే ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేని సమయాల్లో ఇవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే.. ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక పెద్ద కంపెనీ డివిడెండ్‌ ఆపేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక చిన్న కంపెనీ ఏకంగా మూతపడిపోవచ్చు. అందుకే ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బీఎస్‌ఈ ‘ఎస్‌ఎంఈ’, ఎన్‌ఎస్‌ఈ ‘ఎమర్జ్‌’ ప్లాట్‌ఫామ్‌లు ఎస్‌ఎంఈల కోసం ఉద్దేశించినవి. ఇక్కడ సుమారు 380 స్టాక్స్‌ లిస్ట్‌ అయి ఉన్నాయి. వీటి మొత్తం మార్కెట్‌ విలువ రూ.25,600 కోట్లు. ఒక మిడ్‌క్యాప్‌ కంపెనీ మార్కెట్‌ విలువకు సమానం.

మార్కెట్‌ విలువ విషయంలో నక్కకి, నాగలోకానికి అన్నట్టు ఈ కంపెనీల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.4,000 కోట్లుగా ఉంటే, మరొక కంపెనీ మార్కెట్‌ విలువ కేవలం కోటి రూపాయలే. ఈ కంపెనీలన్నింటి టర్నోవర్‌ 2021 మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లు. లాభం రూ.280 కోట్లుగానే ఉంది. ఇన్ఫోసిస్‌ గత ఆర్థిక సంవత్సరంలో ఒక వారంలో నమోదు చేసిన లాభంతో ఇది సమానం. కరోనా సంవత్సరంలో ఈ కంపెనీల రుణ భారం రూ.6,000 కోట్ల నుంచి రూ.6,500 కోట్లకు పెరిగింది. ప్రతీ నాలుగు కంపెనీల్లో ఒకటి నష్టాలను నమోదు చేసింది. ఇంత చిన్నవి కావడం, ఆర్థిక బలం తక్కువగా ఉండడం వల్ల సంక్షోభాల ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. వాటిని ఎదుర్కొనే శక్తి కొన్నింటికే ఉంటుంది.  
...
ఇక లాభాలను పరిశీలిస్తే.. సగటు లాభాల మార్జిన్‌ ఎస్‌ఎంఈలకు ఒక శాతంగానే ఉంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇది సగటున 10 శాతం, మిడ్‌క్యాప్‌ కంపెనీలకు 5 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు 3.4 శాతం చొప్పున ఉంది. వ్యాపార విస్తరణ అవకాశాలు, సరైన వ్యాపార నమూనాలు వీటికి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అర్థం చేసుకోవచ్చు. రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ (ఆర్‌వోసీఈ) ఎస్‌ఎంఈ స్టాక్స్‌కు 8.5 శాతంగా ఉంటే, రిటర్న్‌ ఆన్‌ నెట్‌వర్త్‌ (ఆర్‌వోఎన్‌డబ్ల్యూ) 6.5 శాతం చొప్పున ఉంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు 12–16 శాతం మధ్య, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు 11–16 శాతం మధ్య ఈ రేషియోలు ఉన్నాయి. పైగా చాలా వరకు ఎస్‌ఎంఈ కంపెనీలు టెక్నాలజీ, వినూత్న వ్యాపారాల్లోనివి కావు. ఇప్పటికే వేలాది కంపెనీలు పనిచేస్తున్న సంప్రదాయ వ్యాపారంలోనివే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఈ కంపెనీల వ్యాపారానికి పోటీ తీవ్రంగా ఉంటుంది. తమ కంటే పెద్ద కంపెనీలతో పోటీపడేంత సామర్థ్యం తక్కువ వాటికే ఉంటుంది. రాళ్లలో రత్నాన్ని గుర్తించినప్పుడే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు రాలతాయి. ఇందుకోసం లోతైన అధ్యయనం కావాల్సిందే.  

ఇబ్బందులు రాకుండా ఉండాలంటే...
చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎస్‌ఎంఈ)ల కోసం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ల గురించి వినే ఉంటారు. ఈ విభాగంలో ఐపీవోల గురించి తెలిసింది తక్కువే. ఇటీవలి కాలంలో ఈ విభాగంలోనూ చాలా కంపెనీలు ఐపీవోల ద్వారా లిస్ట్‌ అవుతున్నాయి. కొన్ని కంపెనీలు స్వల్పకాలంలోనే కాసులు కురిపిస్తుండడంతో ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్లు ఇటువైపు చూస్తున్నారు. కొన్ని భారీ రాబడులను తెచ్చిపెడుతున్నది నిజమే. కానీ, నష్టాలు ఇచ్చేవీ ఉంటాయి. రాబడుల కోసం రిస్క్‌ తీసుకునే ముందు.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సినవి, పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తగిన రక్షణ చర్యలతో ప్రయాణం ఆరంభిస్తే.. మధ్యలో ప్రతికూలతలు ఎదురైనా ధైర్యంగా ఎదురొడ్డగలరు. అనుకున్నట్టుగానే లక్ష్యాన్ని చేరుకోగలరు.  

అధ్యయనం చేస్తే లాభాలే..
అన్నింటినీ పరిశీలించి సరైన కంపెనీని ఎంపిక చేసుకుంటే లాభాలు ఖాయమనడానికి ఉదాహరణగా బీఈడబ్ల్యూ ఇంజనీరింగ్, ప్రివెస్ట్‌ డెన్‌ప్రో, ఓమ్ని పొటెంట్, ఫోకస్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ లిస్టింగ్‌ నాడే 50–125 శాతం మధ్య లాభాలను ఇచ్చాయి. 2021లో 45 ఎస్‌ఎంఈ ఐపీవో లు రాగా ఇందులో లిస్టింగ్‌ రోజు 17 కంపెనీలు లాభాలను ఇవ్వలేకపోయాయి. కానీ, ఈకేఐ ఎనర్జీ, రంగోలి ట్రేడ్‌కామ్, నాలెడ్జ్‌ మెరైన్‌ అండ్‌ ఇంజనీరింగ్, బీఈడబ్ల్యూ ఇంజనీరింగ్, ప్రోమ్యా క్స్‌ పవర్‌ అండ్‌ ప్లాటినమోన్‌ బిజినెస్‌ 100 శాతం నుంచి 5,000 శాతానికి పైనే రాబడులను ఇచ్చాయి. 48 ఐపీవోల్లో 24 కంపెనీలు ఇప్పటికీ ఇష్యూ ధరకు దిగువనే ట్రేడ్‌ అవుతున్నాయి.  

విలువ, లభ్యత
బుల్‌ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగానే ఉంటాయి. ఆ సమయంలో కంపెనీల స్టాక్‌ వ్యాల్యూషన్లు గరిష్టాలకు చేరడం సహజం. ఎస్‌ఎంఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే వారు బుల్‌ ర్యాలీల్లో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో ఇతర కంపెనీలకు సంబంధించి ఒక్క షేరును అయినా కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, ఎస్‌ఎంఈ స్టాక్స్‌లో ఇది సాధ్యం కాదు. ఉదాహరణకు ఈకేఐ ఎనర్జీ స్టాక్‌నే తీసుకోండి. నెల క్రితం వరకు 1200 లాట్‌ సైజుగా ఉండేది. అప్పుడు ఒక్కో షేరు ధర రూ.3,000కుపైమాటే. అంటే రూ.36 లక్షలు పెడితేనే ఒక లాట్‌ను కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఆ తర్వాత లాట్‌సైజ్‌ 50కు తగ్గింది. ప్రస్తుతం ధర రూ.5,800గా ఉండడంతో 50 షేర్లను కొనుగోలు చేయాలంటే పెట్టుబడిగా సుమారు రూ.3లక్షలు కావాల్సిందే. సాధారణ కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు ఒక్క లాట్‌ కోసం రూ.15వేల పెట్టుబడి చాలు. కానీ, ఎస్‌ఎంఈ ఐపీవోలో పాల్గొనాలంటే సుమారు రూ.1.20 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది.  

 పీఈ రేషియో ఆధారంగా ఎస్‌ఎంఈ స్టాక్స్‌ ఎంపిక కాకుండా, ఇతర వ్యాల్యూషన్‌ అంశాలను కూడా చూడాల్సి ఉంటుంది. ఎంటర్‌ప్రైజ్‌ వ్యాల్యూ(ఈవీ) టు ఎబిట్డా, ప్రైస్‌ టు బుక్‌ వ్యాల్యూ, అమ్మకాలతో పోలిస్తే కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ఏ మేరకు ఉంది.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి ఆధారంగా దిగ్గజ కంపెనీలతో పోలిస్తే ఈ చిన్న కంపెనీలు చౌకగా ఉన్నాయా లేక ఖరీదుగా ట్రేడవుతున్నాయా అన్న అవగాహనకు రావచ్చు. ఎస్‌ఎంఈ విభాగంలోని క్వాలిటీ ఫార్మా ఏకంగా 55 పీఈలో ట్రేడవుతోంది. అంటే ఫార్మాలో దిగ్గజాలైన దివిస్, గ్లాండ్‌ ఫార్మా, జీఎస్‌కే ఫార్మా, అబ్బాట్‌ ఇండియా, నాట్కో కంపెనీల పీఈ వ్యాల్యూషన్లలో ఈ కంపెనీ ఉంది. ఎస్‌ఎంఈ విభాగంలోని బ్రోకరేజీ స్టాక్‌ ఈస్ట్‌ ఇండియా సెక్యూరిటీస్‌ అయితే 7 పీఈలోనే చౌకగా అందుబాటులో ఉంది. బ్రోకరేజీలో దిగ్గజాలదే ఎప్పుడూ మార్కెట్‌ ఆధిపత్యం ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలకు పోర్ట్‌ఫోలియోలో ప్రాధాన్యం ఇస్తారు.  

ఆటుపోట్లు అధికం
పెద్ద కంపెనీలు అయితే మార్కెట్ల పతనాల్లో నష్టాల పరంగా రిస్క్‌ తక్కువగా ఉంటుంది. కానీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్‌ కంపెనీలు ఎక్కువగా అస్థిరతలకు లోనవుతుంటాయి. ఎస్‌ఎంఈ విభాగంలో అయితే ఆటుపోట్లు మరింత అధికం. 2020 మార్చి సమయంలో ఈ విభాగంలోని ప్రతీ మూడు కంపెనీల్లో రెండు 25 శాతానికి పైనే నష్టపోయాయి. ఎస్‌ఎంఈ స్టాక్స్‌లో లిక్విడిటీ (వ్యాల్యూమ్‌) తక్కువగా ఉంటుంది. దీంతో ప్రతికూల సమయాల్లో, మార్కెట్‌ అస్థిరతల్లో విక్రయించుకోవడం కష్టంగా మారొచ్చు. ముఖ్యంగా డౌన్‌సర్క్యూట్‌లోకి వెళితే మరింత నష్టాలకు విక్రయించుకోవాల్సి రావచ్చు. చిన్న కంపెనీలు కావడంతో అందుబాటులో (ప్రీ ఫ్లోట్‌) షేర్లు కూడా పరిమితంగానే ఉంటుంటాయి. దీంతో ఒక సర్కిల్‌ ఆపరేటర్ల ఆధిపత్యంలోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల వల్ల కొంత కొనుగోలు మద్దతు రాగానే ధరలు అప్పర్‌ సర్క్యూట్‌కు వెళ్లడం.. కొంచెం విక్రయాల ఒత్తిడికే డౌన్‌ సర్క్యూట్‌ను చూడడం కనిపిస్తుంది. ఇది వ్యయాలను పెంచుతుంది. పైగా అన్ని స్టాక్స్‌ రోజువారీగా ట్రేడ్‌ అవుతాయని అనుకోవద్దు. బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ విభాగంలో 201 స్టాక్స్‌కు గాను 90 స్టాక్స్‌లోనే రోజువారీగా ట్రేడింగ్‌ నమోదవుతుంటుంది. బీఎస్‌ఈలో ఎస్‌ఎంఈ షేర్లు ‘ఎం’ గ్రూపు కింద ట్రేడవుతుంటాయి. ఎస్‌ఎంఈలోని 21 కంపెనీలు గత 12 నెలల్లో రెట్టింపునకు పైగా పెరిగాయంటే.. సత్తానా లేక డిమాం డ్‌ వల్లనా అన్న విషయాన్ని తెలుసుకోవాలి.  

కవరేజీ తక్కువ
ఎస్‌ఎంఈ కంపెనీలకు బ్రోకరేజీ సంస్థలు, విశ్లేషకుల కవరేజీ అన్నది ఏదో ఒకటి రెండు కంపెనీలు మినహా దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. దీంతో ఆయా కంపెనీలు, వాటి వ్యాపార వ్యూహా లు, భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలు, పోటీతత్వం, యాజమాన్యం సామర్థ్యం గురించి తెలుసుకునే అవకాశాలు ఉండవు. ఇదే పెద్ద ప్రతికూలత. అయితే, బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ, ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌లు కొన్ని ఎస్‌ఎంఈ స్టాక్స్‌కు సంబం ధించి పరిశోధన నివేదికలను అందుబాటు లో ఉంచుతున్నాయి. కనుక ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందు ఈ నివేదికలను చదివి కంపెనీల గురించి తెలుసుకోవాలి. కంపెనీల సామర్థ్యాలు తెలియనప్పుడు కేవలం డిమాండే ఆయా స్టాక్స్‌ ధరలను నిర్ణయిస్తుంటుంది. కనుక కవరేజీ ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకోవడం కాస్తంత సురక్షితం. దీనివల్ల ఆయా కంపెనీల గురించి ఎక్కువ మందికి సమాచారం వెళుతుంది. పెట్టుబడులూ వస్తాయి.

చిన్న కంపెనీలకు మద్దతుగా..
పెద్ద కంపెనీలకు నిధుల సమీకరణ పెద్ద కష్టమైన పని కాదు. కానీ, అతి చిన్నవైన కంపెనీలకు నిధులను రాబట్టుకోవడం ఎంతో కష్టం. వీటికి మద్దతుగా నిలిచేందుకే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేశాయి. మెయిన్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే ఎస్‌ఎంఈ విభాగంలోని కంపెనీలకు నిబంధనల పరంగా కొంత వెసులుబాటూ ఉంది. ఇతర కంపెనీలకు మాదిరిగా ఎస్‌ఎంఈల  ఐపీవోలకు సెబీ అను మతి అక్కర్లేదు. ఎక్సే్ఛంజ్‌లే అబ్జర్వేషన్‌ లెటర్‌ను మంజూరు చేస్తాయి. మెయిన్‌ ప్లాట్‌ఫామ్‌ల్లోని కంపెనీలు ప్రతీ మూడు నెలలకోసారి ఖాతాలను ఆడిటింగ్‌ చేయించుకోవాలి. ఎస్‌ఎంఈలకు ఇది ఆరు నెలలుగా అమలవుతుంది. సత్తా ఉన్న కంపెనీలు చిన్నవైనా సరే నిధుల సమీకరణతో మరింత ఎదిగేందుకు అనుకూలమైన వేదికలుగా ఇవి ఉపయోగపడతాయి. కనుక ఈ వేదికలు పెట్టుబడులకే కానీ, ట్రేడింగ్‌కు అనుకూలంగా ఉండదు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top