పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికల్లో ఇండోసోల్‌ | Shirdi Sai Electricals Indosol Solar eyes on IPO | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికల్లో ఇండోసోల్‌

Aug 7 2025 6:29 AM | Updated on Aug 7 2025 8:11 AM

Shirdi Sai Electricals Indosol Solar eyes on IPO

రూ. 69,000 కోట్ల పెట్టుబడులు 

హైదరాబాద్‌: షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే ప్రణాళికల్లో ఉంది. రాబోయే కొన్నేళ్లలో రూ. 69,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ సీఎండీ ఎన్‌ విశ్వేశ్వరరెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1 గిగావాట్ల సమగ్ర తయారీ లైన్‌ (ఇన్‌గోట్‌ నుంచి సెల్‌ మాడ్యూల్‌ వరకు) ప్రారంభించనున్నాం. ఆ తర్వాత ఐపీవోకి వచ్చే యోచన ఉంది. ప్రాథమికంగా, ప్రీ–ఐపీవో ప్లేస్‌మెంట్‌ ద్వారా 25–26 శాతం వాటా విక్రయించాలని భావిస్తున్నం‘ అని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. 

ఇండోసోల్‌లో షిర్డీ సాయి 51 శాతం వాటాలను తన దగ్గరుంచుకుని, దాదాపు 49 శాతం వరకు వాటాలను విక్రయించే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఇండోసోల్‌ ఐపీవో గానీ కుదరకపోతే షిర్డీ సాయి ఎలక్ట్రికల్సే 2027 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూకి రావచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. సోలార్‌ పీవీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కారేడు గ్రామంలో 8,348 ఎకరాల స్థలం, అదే జిల్లాలోని చెవురు గ్రామంలో మరో 114.5 ఎకరాల స్థలాన్ని ఇండోసోల్‌కి కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

భవిష్యత్‌ ప్రణాళికలు.. 
పాలీసిలికాన్‌కి ముడి వనరైన క్వారŠట్జ్‌ మైనింగ్‌కి సంబంధించి కర్నూలు, అనంతపురంలో మైనింగ్‌ హక్కులు దక్కించుకున్నామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రూ. 25,000–రూ. 28,000 కోట్లతో ఫేజ్‌1లో భాగంగా తలపెట్టిన 10 గిగావాట్ల లైన్‌ వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో 90,000 మిలియన్‌ టన్నుల (ఎంటీ) పాలీసిలికాన్‌ ఉత్పత్తి తదితర లక్ష్యాలతో ఇండోసోల్‌ ప్రాజెక్టుపై పెట్టుబడులు మొత్తం మీద రూ. 64,000 కోట్లుగా ఉంటాయని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఇందుకోసం అంతర్గతంగాను, అలాగే ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఇరెడా) నుంచి నిధులు సమీకరిస్తున్నట్లు తెలిపారు. బహుళ జాతి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. మరోవైపు, షిర్డీ సాయి ఆర్డర్‌ బుక్‌ రూ. 12,000 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3,000 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 6,500 కోట్లు అంచనా వేస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement