ధనాధన్ రిలయన్స్‌ | Sakshi
Sakshi News home page

ధనాధన్ రిలయన్స్‌

Published Fri, Jul 31 2020 4:48 AM

RIL Q1 Profit rises 31percent to Rs 13248 crore - Sakshi

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అదరగొట్టే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2020–21, క్యూ1)లో రూ. 13,248 కోట్ల రికార్డు స్థాయి కన్సాలిడేటెడ్‌ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభా న్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.10,141 కోట్లతో పోలిస్తే 31 శాతం వృద్ధి నమోదైంది.

ప్రధానంగా జియో లాభాల మోత మోగించడం ఆర్‌ఐఎల్‌ మెరుగైన ఫలితాలకు దోహదం చేసింది. ఇంధన రిటైలింగ్‌ వెంచర్‌లో 49 శాతం వాటాను బ్రిటిష్‌ పెట్రోలియం(బీపీ)కు  విక్రయించడం ద్వారా క్యూ1లో రూ.4,966 కోట్ల అసాధారణ వన్‌టైమ్‌ రాబడి లభించిందని రిలయన్స్‌ వెల్లడించింది. ఇది కూడా రికార్డు లాభాలకు కారణమైంది.

కరోనాతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా మందగించిన తరుణంలో క్యూ1లో కంపెనీ ఫలితాలపై ప్రభావం ఉండొచ్చన్న విశ్లేషకుల అంచనాలను మించి కంపెనీ మెరుగైన పనితీరును కనబరచడం గమనార్హం. కాగా, 2019–20 ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.11,640 కోట్ల నికర లాభం ఇప్పటిదాకా కంపెనీ అత్యధిక త్రైమాసిక లాభంగా రికార్డుల్లో నిలిచింది. దీన్ని ఇప్పుడు అధిగమించింది. కాగా, భారతీయ కంపెనీల్లో అత్యధిక త్రైమాసికం లాభం ఆర్జించిన రికార్డు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ)దే. 2012–13 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో ఈ సంస్థ రూ.14,513 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

చమురు, పెట్రోకెమికల్‌ వ్యాపారాలపై ప్రభావం...
క్యూ1లో కంపెనీ స్థూల లాభం(ఎబిటా) 11.8 శాతం క్షీణించి రూ.21,585 కోట్లకు తగ్గింది. పెట్రోలియం ఇంధనం, పాలిస్టర్‌ ఉత్పత్తుల డిమాండ్‌ తీవ్రంగా పడిపోవడంతో చమురు, పెట్రోకెమికల్‌ వ్యాపారాలు దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఎగుమతులు క్షీణించడం కూడా లాభదాయకతపై ప్రభావం చూపిందని తెలిపింది. ‘కరోనా వైరస్‌ కల్లోలంతో స్టోర్స్‌ మూసివేత, దేశవ్యాప్తంగా కార్యకలాపాలపై నియంత్రణల వల్ల రిటైల్‌ వ్యాపార ఎబిటా దిగజారింది. అయితే, డిజిటల్‌ సర్వీసుల వ్యాపారంలో మార్జిన్లు మెరుగుపడటం వల్ల ప్రతికూలతలను తట్టుకోగలిగాం’ అని కంపెనీ వెల్లడించింది.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు...
► పెట్రోకెమికల్స్‌ వ్యాపార ఆదాయం క్యూ1లో 33 శాతం పడిపోయి రూ.25,192 కోట్లకు దిగజారింది.

► చమురు రిఫైనింగ్‌ ఆదాయం 54.1 శాతం తగ్గుదలతో రూ.46,642 కోట్లకు క్షీణించింది.

► క్యూ1లో స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌–జీఆర్‌ఎం) 6.3 డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్‌లో జీఆర్‌ఎం 8.1 డాలర్లు కాగా, క్రితం క్వార్టర్‌(2019–20, క్యూ4)లో 8.9 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్‌ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు.

► చమురు–గ్యాస్‌ వ్యాపారం 45.2 శాతం క్షీణతతో రూ.506 కోట్లకు పరిమితమైంది.

► లాక్‌డౌన్‌తో 50 శాతం స్టోర్స్‌ పూర్తిగా మూసేయడం, 29% స్టోర్స్‌ పరిమిత స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారం మెరుగైన స్థాయిలో రూ. 31,633 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. రూ.1,083 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది.


ఆర్‌ఐఎల్‌ షేరు గురువారం బీఎస్‌ఈలో 0.61 శాతం లాభంతో రూ.2,109 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ ముగిసిన తరవత కంపెనీ ఫలితాలను ప్రకటించింది.

నిధుల సునామీ...
జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 33 శాతం వాటాను ఫేస్‌బుక్, గూగుల్‌ ఇతరత్రా పలు ప్రపంచస్థాయి కంపెనీలకు విక్రయించడం ద్వారా రిలయన్స్‌ రూ.1,52,056 కోట్ల నిధులను సమీకరించింది. అదేవిధంగా రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు లభించాయి. ఇంధన రిటైలింగ్‌ వ్యాపారంలో 49 శాతం వాటాను బీపీకి అమ్మడం ద్వారా రూ.7,629 కోట్లను దక్కించుకుంది. తద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికర రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించింది.

దుమ్మురేపిన జియో...
ఆర్‌ఐఎల్‌ టెలికం అనుబంధ సంస్థ జియో లాభాల మోత మోగించింది. క్యూ1లో కంపెనీ నికర లాభం రూ.2,520 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.891 కోట్లతో పోలిస్తే 183 శాతం వృద్ధి నమోదైంది. ఇక జియో ఆదాయం కూడా 33.7 శాతం ఎగబాకి రూ.16,557 కోట్లకు చేరింది. నెలకు ఒక్కో యూజర్‌ నుంచి ఆదాయం(యావరేజ్‌ రెవెన్యూపర్‌ యూజర్‌–ఏఆర్‌పీయూ) క్యూ1లో రూ.140.3గా నమోదైంది. క్రితం క్వార్టర్‌(2019–20, క్యూ4)లో ఏఆర్‌పీయూ రూ.130.6గా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి జియో మొత్తం యూజర్ల సంఖ్య 38.75 కోట్లు కాగా, జూన్‌ చివరినాటికి ఈ సంఖ్య 39.83 కోట్లకు వృద్ధి చెందింది.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్స్‌ ప్రకటించడంతో హైడ్రోకార్బన్స్‌ వ్యాపారం డిమాండ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అయితే, కార్యకలాపాల్లో వెసులుబాటు కారణంగా దాదాపు సాధారణ స్థాయిలోనే నిర్వహణ సాధ్యమైంది. దీంతో పరిశ్రమలోకెల్లా ధీటైన ఫలితాలను ప్రకటించగలిగాం. కరోనా లాక్‌డౌన్‌ కాలంలోనూ కంపెనీ క్యూ1లో రికార్డు స్థాయిలో నిధులను దక్కించుకుంది. భారతీయ కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్ద నిధుల సమీకరణను ఏప్రిల్‌–జూన్‌
క్వార్టర్‌లో మేం పూర్తిచేశాం’.

– ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ అధినేత  

Advertisement
 
Advertisement
 
Advertisement