ఎన్‌సీడీ హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ డిఫాల్ట్‌ | Sakshi
Sakshi News home page

ఎన్‌సీడీ హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ డిఫాల్ట్‌

Published Wed, Mar 30 2022 10:51 AM

Religare Finvest Default on an Interest Payment to NCD Holders - Sakshi

న్యూఢిల్లీ: నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్‌(ఎన్సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుపై రెలిగేర్‌ ఫిన్వెస్ట్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌ఎల్‌) విఫలమైంది. రెలిగేర్‌ ఎంటర్ర్‌పైజెస్‌ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ,  రుణభారంలో ఉన్న తన అనుబంధ సంస్థ రెలిగేర్‌ ఫిన్వెస్ట్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌ఎల్‌) మార్చి 28న నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లకు చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులో డిఫాల్ట్‌ అయిందని తెలిపింది. ఈ విలువ దాదాపు రూ.2.41 కోట్లని ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో సంస్థ తెలిపింది. సంస్థ డిఫాల్ట్‌ వరుసగా ఇది రెండవనెల. తనకు రావాల్సిన-చెల్లించాల్సిన రుణాల్లో అసమతుల్యత కారణంగా బాండ్‌ హోల్డర్లకు ఫిబ్రవరి 25న చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులో(రూ. 96 లక్షల వడ్డీ చెల్లింపుల్లో) ఆర్‌ఎఫ్‌ఎల్‌ గత నెల్లో డిఫాల్ట్‌ అయ్యింది.  

డిఫాల్ట్‌ ఎందుకంటే... 
ఈ మేరకు వెలువడిన ప్రకటన ప్రకారం, ఆర్‌ఎఫ్‌ఎల్‌  రుణదాతలు సూచించినట్లుగా, సంస్థ అన్ని చెల్లింపులకు రుణదాతలు నియమించిన ఏఎస్‌ఎం (ఏజెన్సీస్‌ ఫర్‌ స్పెషలైజ్డ్‌ మానిటరింగ్‌) నుండి ముందస్తు ధృవీకరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారం, ఆర్‌ఎఫ్‌ఎల్‌ 2022 మార్చి 28న చెల్లించాల్సిన అర్హత కలిగిన డిబెంచర్‌ హోల్డర్లకు ‘ఎన్సీడీల సిరీస్‌-36 వడ్డీ చెల్లింపు సర్టిఫికేట్‌ కోసం’ ఏఎస్‌ఎంను ఆర్‌ఎఫ్‌ఎల్‌ అభ్యర్థించింది. అయితే ఇందుకు ఏఎస్‌ఎం ఆమోదం లభించలేదు. ఈ  కారణంగా, అర్హత కలిగిన హోల్డర్లకు ఎన్సీడీ వడ్డీ మొత్తాన్ని ఆర్‌ఎఫ్సీ చెల్లించలేకపోతోంది. 

ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో... 
ఆర్‌ఎఫ్‌ఎల్‌  బలహీన ఆర్థిక స్థితి కారణంగా జనవరి 2018 నుండి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల చట్రంలో (సీఏపీ) ఉంది. తాజా వ్యాపారాన్ని చేపట్టకుండా ఆంక్షలు ఉన్నాయి. రెలిగేర్‌ ఎంటర్ర్‌పైజెస్‌ ప్రమోటర్గా కొనసాగుతున్న ఆర్‌ఎఫ్‌ఎల్‌ పునరుద్ధరణ ప్రణాళికను మార్చి 11న ఆర్‌బీఐ తిరస్కరించింది. రుణభారంలో ఉన్న ఆర్‌ఎఫ్‌ఎల్పై ‘‘మోసపూరిత’’ ఆరోపణలు ఉండడమే దీనికి కారణం. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ, ఆర్‌ఎఫ్‌ఎల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకుంది. మాజీ ప్రమోటర్లు శివిందర్‌ సింగ్, అతని సోదరుడు మల్విందర్‌ సింగ్‌ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల కారణంగా కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దాదాపు రూ. 4,000 కోట్ల ఆర్థిక అవకతవకలపై పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. 

(చదవండి: అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఏడుగురు భారతీయులు!)

Advertisement
Advertisement