Moody: మారిన ‘అవుట్‌లుక్‌’, భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే?

Ratings agency Moody changed India sovereign rating outlook - Sakshi

‘నెగటివ్‌’ నుంచి ‘స్టేబుల్‌’కు అప్‌గ్రేడ్‌ ఎకానమీ, ఫైనాన్షియల్‌ వ్యవస్థలకు ఇబ్బందులు తగ్గాయని విశ్లేషణ సావరిన్‌ రేటింగ్‌ మాత్రం ‘బీఏఏ3’ వద్ద యథాతథం  

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’ నుంచి ‘స్టేబుల్‌’కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ మూడీస్‌ పేర్కొంది. ఆర్థిక, ఫైనాన్షియల్‌ వ్యవస్థలకు సవాళ్లు తగ్గడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే సావరిన్‌ రేటింగ్‌ను మాత్రం యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ప్రస్తుతం భారత్‌కు మూడీస్‌ ‘బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. జంక్‌ (చెత్త) స్టేటస్‌కు ఇది ఒక అంచె ఎక్కువ. కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సెప్టెంబర్‌ చివరి వారంలో మూడీస్‌ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌ ఎకానమీ మూలస్తంభాలు పటిష్టంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు ఈ సందర్భంగా మూడీస్‌ ప్రతినిధులకు వివరించారు.

ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ కేవీ సుబ్రమణ్యం, ఇతర సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  మహమ్మారి ప్రేరిత సవాళ్ల నుంచి ఎకానమీ వేగంగా రికవరీ చెందుతోందని మూడీస్‌ ప్రతినిధులకు అధికారులు వివరించారు. సంస్కరణలను, రికవరీ వేగవంతానికి ఆయా సంస్కరణలు ఇస్తున్న తోడ్పాటు వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.   2021–22 బడ్జెట్‌ తీరు, ద్రవ్యలోటు, రుణ పరిస్థితులు కూడా సమావేశంలో చోటుచేసుకోనున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో మూడీస్‌ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్‌ చేసినా, రేటింగ్‌ను మాత్రం యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 
మూడీస్‌ చెప్పిన ముఖ్యాంశాలు... 

భారత్‌ ఫారిన్‌ కరెన్సీ, లోకల్‌ కరెన్సీ దీర్ఘకాలిక ఇష్యూయెర్‌ రేటింగ్స్, లోకల్‌ కరెన్సీ సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ రేటింగ్స్‌ను కూడా ‘బీఏఏ3’గా కొనసాగిస్తున్నట్లు మూడీస్‌ తాజాగా విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
 
♦ మూలధనం, ద్రవ్యలభ్యత, బ్యాంకులు, నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ సంస్థల పరిస్థితులు గతంతో పోల్చితే ఇప్పుడు మెరుగుపడినట్లు మూడీస్‌ వివరించింది.
 
 అయితే రుణ భారాలపై అప్రమత్తత అవసరమని సూచించింది. మూడీస్‌ తాజా ప్రకటన ప్రకారం  2019లో జీడీపీలో భారత్‌ రుణ భారం 74 శాతం. 2020 జీడీపీలో ఇది 89 శాతానికి చేరింది. సమీపకాలంలో దాదాపు 91 శాతంగా ఉండే అవకాశం ఉంది. రుణ భారాల నిష్పత్తుల తగ్గాలంటే, దేశానికి భారీ వృద్ధి రేటు అవసరం.
 
♦ ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే కొద్ది సంవత్సరాల్లో మరింత తగ్గుతుందన్న అంచనాలను మూడీస్‌ వెలువరించింది.
 
♦ ద్రవ్యలోటు తగ్గితే దేశ సావరిన్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ బలహీనతలు మరింత తగ్గుతాయని విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతానికి (రూ.15,06,812 కోట్లు) కట్టడి చేయాలన్నది 2021–22 బడ్జెట్‌ లక్ష్యం. 2020–21 ఆర్థిక సంవత్సరం కరోనా కష్టాల్లో ఈ లోటు ఏకంగా 9.3 శాతానికి ఎగసింది.  

♦ భారత్‌ ఆర్థిక వ్యవస్థ రికవరీ పరిస్థితులు బాగున్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు కరోనా ముందస్తుకాలంకన్నా మెరుగుపడే అవకాశం ఉంది. 2020–21లో జీడీపీ 7.3 శాతం పతనం అయితే, 2021–22లో 9.3 శాతంగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతంగా నమోదుకావచ్చు.  

 వ్యాక్సినేషన్‌ పెరగడంతో మూడవవేవ్‌ ముప్పు ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉండకపోవచ్చు.  

 ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన, సంస్కరణాత్మక చర్యలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, దేశం చక్కటి వృద్ధి బాటన దూసుకుపోయే అవకాశం ఉంది. 

రేటింగ్‌ల తీరు... 
13 సంవత్సరాల తర్వాత నవంబర్‌ 2017లో భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను మూడీస్‌ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్‌ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది.

‘బీఏఏ3’ జంక్‌ (చెత్త) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. రేటింగ్‌ దిగ్గజ సంస్థలు ఫిచ్, ఎస్‌అండ్‌పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తున్నాయి. భారత్‌ దీనిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.  భారత్‌ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్‌ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ.  

ప్రాముఖ్యత ఎందుకు? 
అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ఇచ్చే సావరిన్‌ రేటింగ్‌ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తీసుకుంటారు. ప్రతియేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, రేటింగ్‌ పెంపునకు విజ్ఞప్తి చేస్తారు. కొద్ది నెలల క్రితం మరో రేటింగ్‌ దిగ్గజం– ఫిచ్‌తో కూడా ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top