బిజినెస్‌ ‘బాహుబలి’ భవీశ్‌

Ola CEO Bhavish Aggarwal Marketing Techniques Look like Baahubali Promotions - Sakshi

బిజినెస్‌కి, సినిమాలకు బ్రాండ్‌ ఇమేజ్‌, ప్రమోషన్‌ ఎంతో ముఖ్యం. అందుకే సినిమా లేదా ప్రొడక్టు రిలీజ్‌కు ముందు చాలా హంగామా చేస్తారు. కానీ ఎలాంటి హాడావుడి చేయకుండా కేవలం సోషల్‌ మీడియా ద్వారానే బ్రాండ్‌ని ప్రమోటై బాహుబలి ఓ కొత్త ట్రాక్‌ వేసింది. ఇప్పుడదే దారిలో నడుస్తున్నాడు ఓలా సీఈవో భవీశ్‌ అగర్వాల్‌. చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరి చేతా ఔరా అనేలా ఓలాను ప్రమోట్‌ చేస్తున్నారు.

ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి యంగ్‌ ఎంట్రప్యూనర్‌ భవీశ్‌ అగర్వాల్‌ అనుసరిస్తున్న సరికొత్త ప్రచార ప​ంథా స్టార్టప్‌లకు స్పూర్తిగా నిలుస్తోంది. కేవలం సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని బ్రాండ్‌ ప్రమోషన్‌ చేయడమే కాకుండా విపత్కర పరిస్థుల్లోనూ తన యూనికార్న్‌ కంపెనీ బ్రాండ్‌ ఇమేజ్‌కి భంగం కలగకుండా జాగ్రత్త పడుతున్న తీరు బిజినెస్‌ సర్కిళ్లలో సంచలనంగా మారింది.

మంటల్లో బ్రాండ్‌ ఇమేజ్‌
వేసవి ఆరంభం కావడం మొదలు అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా చాలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో మంటలు చెలరేగాయి. కొన్ని సందర్భాల్లో స్కూటర్లు అగ్నికి ఆహుతి అవగా మరికొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా జరిగింది. అనేక కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మంటల్లో చిక్కుకుంటూ వాటి భద్రతపై సందేహాలు రేకెత్తించాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓలా స్కూటర్లపైనే నెగటీవ్‌ ప్రచారం మొదలైంది. సంచలన రీతిలో దేశవ్యాప్తంగా ఆకట్టుకున్న ఈ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్రాండ్‌కి ఇది ఓ రకంగా అశనిపాతమే.

కమ్యూనిటీ ర్యాలీ
ఓలా ‍బ్రాండ్ ఇమేజ్‌కి జరుగుతున్న నష్టాన్ని అదుపు చేసేందుకు  ఈ కంపెనీ ఫౌండర్‌ కమ్‌ సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ రంగంలోకి దిగాడు. స్కూటర్ల భద్రతపై తాను ఎన్ని హామీలు ఇచ్చినా వేస్టని గ్రహించాడు. అందుకే ఓలా స్కూటర్లు వాడుతున్న కస్టమర్ల చేతనే ఆ మాట చెప్పించాలని నిర్ణయించాడు. అందులో భాగంగా తెర మీదకు వచ్చిందే ఓలా కమ్యూనిటీ ర్యాలీలు. ముంబై నుంచి మొదలు పెట్టి చెన్నై, పూనే ఇలా ఒక్కో నగరంలో ఈ ర్యాలీను నిర్వహిస్తూ తాజాగా హైదరాబాద్‌లో కూడా పూర్తి చేశారు. ఓలా స్కూటర్లు ఎంత భద్రమైనవో కస్టమర్ల చేతనే రివ్యూ ఇప్పించాడు. ఇదంతా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ హంగామా సృష్టించాడు. 

మైలేజీ మ్యాజిక్‌
ఇక ఓలా స్కూటర్ల మైలేజీ ఎంత వస్తుందనే అంశంపై ఉన్న సందేహాలను పటాపంచాలు చేసేందుకు మరో కాంటెస్ట్‌ నిర్వహించారు. సింగిల్‌ ఛార్జ్‌తో అత్యధిక మైలేజీ పొందిన వారికి గెరువా రంగు స్కూటర్లు  ఫ్రీగా బహుమతిగా ఇస్తానంటూ మరో కంటెస్ట్‌ పెట్టాడు. దీని మీద జరిగిన హాడావుడితో మైలేజీ మీద కూడా నమ్మకం కలిగించాడు భవీశ్‌. ఆఖరికి కర్నాటకలో ఉన్న కాషాయ ట్రెండ్‌ను అనుసరించి గెరువా (కషాయ రంగులో)  కలర్‌లో కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి తెచ్చాడు భవీశ్‌.

ఫస్ట్‌టైం ఇన్‌ హిస్టరీ
ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విషయంలో ఆది నుంచి భవీష్‌ భిన్నమైన మార్కెటింగ్‌ వ్యూహాలను అనుసరించాడు. ఆటోమొబైల్‌ చరిత్రలోనే తొలిసారిగా షోరూమ్‌లు లేని వెహికల్‌గా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు ఆన్‌లైన్‌లో స్కూటర్ల బుకింగ్‌ మొదలెట్టి లక్షకు పైగా ప్రీ బుకింగ్స్‌ సాధించి రికార్డు సృష్టించాడు. ప్రీ బుకింగ్స్‌లో అడ్వాన్స్‌ చెల్లించిన వారు డెలివరీ విషయంలో జరుగుతున్న ఆలస్యంపై నిందలు వేస్తుండటంతో.. హ్యాపీ మూమెంట్స్‌ పేరుతో స్కూటర్‌ డెలివరీ ప్రచారానికి తెర తీశాడు. . మూవ్‌ఓఎస్‌ 2 విషయంలోనూ సోషల్‌ మీడియాను గణనీయంగా వాడుకున్నాడు భవీశ్‌.

విమెన్‌ స్పెషల్‌
సాధారణంగా బైకులు మగవాళ్లు ఇష్టపడితే ఆడవాళ్లు స్కూటర్లకే పరిమితం అవుతుంటారు. దీంతో ఓలా స్కూటర్ల విషయంలో పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ సృష్టించేందుకు మరో ఎత్తుగడను అనుసరించాడు భవీశ్‌. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ కర్మగారంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. మహిళా సాధికారతకు ఓలా అద్దం పడుతుంది అంటూ విస్త్రృత ప్రచారం చేయగలిగాడు

ఈలాన్‌తో పోలిక
త్వరలో ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ కార్లను తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు భవీశ్‌. ఇప్పటికే ప్రోటోటైప్‌ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ కారుకు కూడా బజ్‌ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు భవీశ్‌. అందులో భాగంగా ఇండియాకు టెస్లా కార్లు తెచ్చే విషయంలో ఒక అడుగు ముందుకు రెండు అడగులు వెనక్కి వేస్తున్న ఈలాన్‌ మస్క్‌ వ్యవహార తీరుపై సెటైరిక్‌గా స్పందించాడు భవీశ్‌. ఇండియాకు రానందుకు థ్యాంక్స్‌, బట్‌ నాట్‌ థ్యాంక్స్‌ అంటూ టెస్లాకు పోటీగా ఓలా ఉందనే ఫీల్‌ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు భవీశ్‌.

చదవండి: మనోడు గట్టొడే! ఏకంగా ఈలాన్‌ మస్క్‌ మీదే వేశాడు పెద్ద పంచ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top