8.5 శాతం వృద్ధి లేదంటే భారత్‌కు కష్టమే! 

McKinsey Global Institute Report On Country Growth Rate - Sakshi

మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక

లేదంటే ఆదాయాలు, జీవన నాణ్యతా  ప్రమాణాలూ తగ్గుతాయని విశ్లేషణ  

ముంబై: కోవిడ్‌–19 సమస్య సమసిపోయిన అనంతరం భారత్‌లో అవకాశాల సృష్టికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దశాబ్ద కాలంపాటు వార్షికంగా 8 నుంచి 8.5 శాతం వరకూ వృద్ధి  సాధన జరగాల్సిన అవసరం ఉందని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. భారీ వృద్ధిరేటులేని పరిస్థితిలో దేశంలో ఆదాయాల స్తబ్దత నెలకొంటుందని, జీవన నాణ్యత లోపిస్తుందని విశ్లేషించింది. ఈ పరిస్థితుల్లో భారీ వృద్ధికి తక్షణ చర్యలు అవసరమని తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 

దేశంలో ఉత్పాదకత పెరగాలి. ఉపాధి సృష్టి జరగాలి. ఇందుకు రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో పలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.  
2013 నుంచి 2018 మధ్య భారత్‌ వార్షికంగా సగటున 40 లక్షల వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు సృష్టించింది. తాజా పరిస్థితుల ప్రకారం పట్టణీకరణ పెరుగుతోంది. జనాభా పెరుగుదల కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి వార్షికంగా 1.2 కోట్ల వ్యవసాయేతర ఉపాధి అవకాశాల సృష్టి జరగాలి.  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) భారత్‌ జీడీపీ 5% వరకూ క్షీణించే అవకాశం ఉంది. అయితే కోవిడ్‌ అనంతరం తాజా అవకాశాల సృష్టికి వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌ 8 నుంచి 8.5% వృద్ధి సాధించాల్సిందే. లేదంటే రానున్న దశాబ్ద కాలంలో తీవ్ర సవాళ్లు తప్పవు.  
తయారీ, రియల్‌ ఎస్టేట్, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌ పరిశ్రమసహా కార్మిక, భూ వ్యవహారాల్లో సంస్కరణలు తక్షణం జరగాలి. అలాగే తక్కువ టారిఫ్‌లతో వినియోగదారులకు విద్యుత్‌ సౌకర్యాలను అందించడానికి తగిన ప్రయత్నాలు జరగాలి.  
ఫైనాన్షియల్‌ రంగంలో సంస్కరణలు, ద్రవ్యలోటు కట్టడి, తగిన సరళతర వడ్డీరేట్ల విధానంతో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. 
మొండిబకాయిల పరిష్కార దిశలో ‘బ్యాడ్‌బ్యాంక్‌’ ఏర్పాటు జరగాలి.  
సంస్కరణల పరంగా చూస్తే, 60 శాతం రాష్ట్రాల వైపు నుంచి జరగాల్సి ఉండగా, 40 శాతం కేంద్రం చేపట్టాల్సి ఉంటుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top