హైదరాబాద్‌లో పెట్‌కేర్‌ రూ.500 కోట్ల పెట్టుబడి.. వరంగల్‌లో జెన్‌ప్యాక్ట్‌ క్యాంపస్‌

MARS Petcare Signed MoU With Telangana Govt To Invest RS 500 Crore to expand manufacturing facility in Hyderabad - Sakshi

పెంపుడు జంతువుల ఆహార పదార్థాల తయారీ సంస్థ మార్స్‌ పెట్‌కేర్‌ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం నగరంలో ఆ సంస్థకు ఉన్న ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం మీద సంతకం చేసింది. మరోవైపు తెలంగాణ సాంస్కృతిక రాజాధానిలో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకుంటోంది. మరో ప్రముఖ కంపెనీ ఇక్కడ సెంటర్ ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 

పిడిగ్రీ తయారీ ఇక్కడే
మార్స్‌ పెట్‌కేర్‌ సంస్థ హైదరాబాద్‌ నగరంలో 2008లో కర్మాగారం ఏర్పాటు చేసింది. కుక్కలతో పాటు ఇతర పెంపుడు జంతువులు తినే డ్రై ఆహార పదార్థాలు ఇక్కడ తయారవుతున్నాయి. అయితే గత దశాబ్ధం కాలంగా పెంపుడు జంతువులకు పోషక ఆహారం అందించే విషయంలో ప్రజలకు అవగాహాన పెరిగింది. ఫలితంగా ఈ మార్కెట్‌ పుంజుకుంది. ముఖ్యంగా కుక్కలకు ఆహారంగా అందించే పిడిగ్రీ ఇప్పుడు అందరికీ సుపరిచితమే అయ్యింది. పిడిగ్రీ బ్రాండు పెట్‌ ఫుడ్‌ మన హైదరాబాద్‌లోనే తయారవుతోంది.
రూ.500 కోట్ల పెట్టుబడి
పెరుగుతున్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ఫ్యాక్టరీ కెపాసిటీ పెంచనున్నారు. ఇందు కోసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది మార్స్‌ పెట్‌కేర్‌ సంస్థ. ఇక్కడ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 65 కిలోటన్నులకు పెంచడం ద్వారా హైదరాబాద్‌ నుంచే మన దేశంతో పాటు ఇతర ఏషియా దేశాలకు పెంపుడు జంతువుల ఆహారం సరఫరా కానుంది.

విన్‌ విన్‌ ఫార్ములా
పెట్‌కేర్‌ సంస్థ తన ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు స్థానికంగా పండే తృణ ధాన్యాలకు సరికొత్త మార్కెట్‌ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా నగరం చుట్టు పక్కల జిల్లాలో తృణధాన్యం రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు మార్స్‌ పెట్‌కేర్‌ సంస్థ పెట్టుబడులను విన్‌ విన్‌ ప్రతిపాదనగా మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో అభివర్ణించారు.

వరంగల్‌కి మరో ఐటీ కంపెనీ
ఐటీ రంగంలో నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోన్న వరంగల్‌ నగరం మరో అద్భుత అవకాశం ఒడిసిపట్టుకుంది. ఇప్పటికే ఈ నగరంలో అనేక స్టార్టప్‌లతో పాటు సెయింట్‌, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ కంపెనీలు తమ క్యాంపస్‌లు ప్రారంభించాయి. తాజాగా వాటి సరసన అమెరికాకు చెందిన జెన్‌పాక్ట్‌ సంస్థ చేరింది. వరంగల్‌లో తమ క్యాంపస్‌ను ప్రారంభిస్తామని జెన్‌ప్యాక్ట్‌ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను ఆ సంస్థ సీఈవో త్యాగరాజన్‌ కలిశారు. 

నిర్మాణంలో
ఇప్పటికే వరంగల్‌ నగరంలో సెంటర్‌ నిర్మాణ పనుల్లో మైండ్‌ట్రీతో పాటు మరికొన్ని సంస్థలు ఉన్నాయి. వీటి క్యాంపస్‌ నిర్మాణ పనులకు గతంలోనే మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఐటీ, వస్త్ర పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు వరంగల్‌ ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. 

చదవండి: వాటాలు విక్రయించనున్న ఏఐజీ హాస్పిటల్స్‌ ప్రమోటర్లు?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top