బేర్ దెబ్బకు భారీగా కిందకు పడిపోయిన సెన్సెక్స్‌.. కారణాలివే! | Sakshi
Sakshi News home page

బేర్ దెబ్బకు భారీగా కిందకు పడిపోయిన సెన్సెక్స్‌.. కారణాలివే!

Published Thu, Jan 20 2022 7:38 AM

Market Roundup: Sensex ends 656 points lower, Nifty Below 18000  - Sakshi

ముంబై: జాతీయ అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్‌ సూచీలు రెండో రోజూ నష్టాలను చవిచూశాయి. ఆర్థిక, కన్జూమర్, ఐటీ, ప్రైవేట్‌ బ్యాంక్స్, ఫార్మా షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ బుధవారం 656 పాయింట్ల నష్టంతో 60,099 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 175 పాయింట్లు పతనమైన 18,000 స్థాయి దిగువన 17,938 వద్ద ముగిసింది. మెటల్, ఇంధన, ఆటో, మీడియా షేర్లు రాణించాయి. సెన్సెక్స్‌ సూచీలోని 30 షేర్లకు గానూ 28 షేర్లు నష్టపోయాయి.

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ అమ్మకాల ఒత్తిడికి లోనైన సెన్సెక్స్‌ ఒక దశలో 806 పాయింట్లు క్షీణించి 59,949 వద్ద, నిఫ్టీ 228 పాయింట్ల మేర నష్టపోయి 17,885 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 14 పైసలు బలపడి 74.44 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,705 కోట్ల షేర్లను దేశీయ ఇన్వెస్టర్లు రూ.195 కోట్ల షేర్లను అమ్మేశారు.   

రెండు రోజుల్లో రూ.5.24 లక్షల కోట్లు ఆవిరి   
రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 1,210 పాయింట్లు పతనమవడంతో రూ.5.24 లక్షల కోట్ల స్టాక్‌ మార్కెట్‌ సంపద ఆవిరైంది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.276.24 లక్షల కోట్లకు పడిపోయింది. ఇన్వెస్టర్ల సంపద సోమవారం జీవితకాల గరిష్టస్థాయి రూ.280 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. 

మార్కెట్లో మరిన్ని సంగతులు 

  • పేటీఎం షేరు నాలుగు శాతం నష్టపోయి రూ.997 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నాలుగున్నర శాతం క్షీణించి రూ.997 వద్ద జీవితకాల కనిష్టాన్ని తాకింది. 
  • మూడో త్రైమాసికంలో రూ.137 కోట్ల నష్టాన్ని ప్రకటించడంతో స్టెరిలైట్‌ టెక్‌ షేరు ఎనిమిది శాతం క్షీణించి రూ.249 వద్ద నిలిచింది.  
  • జస్ట్‌ డయల్‌ షేరు 3% క్షీణించి రూ.812 వద్ద ముగిసింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో లాభం 61.1% క్షీణించడం షేరు పతనానికి కారణమైంది. 

నష్టాలకు 4 కారణాలు

1) బాండ్ల రాబడి భయాలు 
ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్ల పెంపు అనివార్యమని ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ పావెల్‌ స్పష్టతనివ్వడంతో యూఎస్‌ పదేళ్ల ట్రెజరీ బాండ్లపై రాబడులు రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. భవిష్యత్తులోనూ ఫెడ్‌ ద్రవ్య పాలసీపై కఠిన వైఖరిని ప్రదర్శించవచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను అమ్మేసి బాండ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మంగళవారం రాత్రి యూఎస్‌ మార్కెట్లు రెండున్నర శాతం క్షీణించాయి. ఆసియాలో బుధవారం జపాన్, చైనా, దక్షిణ కొరియా మార్కెట్లు 3–1% చొప్పున నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు సైతం 1% నష్టంతో మొదలయ్యాయి.

2) ముడిచమురు మంటలు  
పాశ్చత్య దేశాల్లో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతలతో సరఫరా ఆందోళనలు తెరపైకి వచ్చి అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడిచమురు ధర ఏడేళ్ల గరిష్ట స్థాయిని చేరడం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.

3) దేశ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు 
విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరిలో ఇప్పటికి వరకు  రూ.7,735 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.  గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో దేశీయ ఇన్వెస్టర్లూ రూ.530 కోట్ల షేర్లను అమ్మేశారు.  

4) బడ్జెట్‌ ముందు అప్రమత్తత  
కేంద్ర బడ్జెట్‌ ప్రకటన ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.  కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరపు ద్రవ్యోలోటు కట్టడి లక్ష్యాన్ని 6.3–6.5% స్థాయిలోనే నిర్ణయించుకోవచ్చనే అంచనాలున్నాయి.

(చదవండి: దూసుకెళ్తున్న లంబోర్గినీ కార్లు!)

Advertisement
Advertisement