నా భార్య కోసం ఆర్డర్‌ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్‌ మహీంద్రా

Mahindra XUV700 Booking: Chirag Shetty Gets Funny Response From Anand Mahindra - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉంటారు. ఆయన పెట్టే పోస్ట్‌లు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్‌ అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. భారత జట్టు ఇటీవల థామస్‌ కప్‌ని గెలిచి బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి డబుల్స్ జోడీ జట్టు విజయంతో కీలకపాత్ర పోషించింది. 


చారిత్రక విక్టరీని లిఖించిన భారత జట్టును ప్రశంసిస్తూ ఆనంద్‌ మహీంద్ర ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు. దీనికి చిరాగ్ శెట్టి స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు తాను ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన ఎస్‌యూవీ 700 కారు బుక్‌ చేశానని, కాస్త తొందరగా డెలివరీ చేయాలని అభ్యర్థించాడు. దీనికి ఆనంద్‌ మహీంద్రా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ‘ఛాంపియన్‌ల ఎంపికగా మారిన ఎస్‌యూవీ 700ని వీలైనంత త్వరగా మీకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నా భార్య కోసం నేను కూడా ఒకటి ఆర్డర్ చేసాను. నేను ఇప్పటికే క్యూలోనే ఉన్నాను’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. (క్లిక్‌: ఎంట్రి లెవల్‌ కార్ల అమ్మకాలు ఢమాల్.. ఎందుకంటే?)

కరోనా సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా చిప్‌సెట్ల కొరత ఏర్పడటంతో కార్ల తయారీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొత్త కార్లు తయారు చేయడానికి కంపెనీలకు చాలా సమయం పడుతోంది. దీంతో బుకింగ్‌లు ఉన్నప్పటికీ కార్లను డెలివరీ చేయలేక కంపెనీలు సతమతమవుతున్నాయి. అటు వినియోగదారులు కూడా కొత్త కార్ల కోసం సుదీర్ఘ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. (క్లిక్‌: ఆర్డర్లు ఉన్నా‍యి.. కానీ టైమ్‌కి డెలివరీ చేయలేం!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top