పాత బంగారం మార్పిడి పథకాలపై నగల వ్యాపారులు దృష్టి సారించారు. భారత్‌లో విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవడానికి బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి విషయం తెలిసిందే. దీంతో ఆభరణాల రంగం బంగారం రీసైక్లింగ్, మార్పిడి పథకాల వైపు అడుగులు వేస్తోంది. డిమాండ్‌ను పూర్తిగా తగ్గించే బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.
“దిగుమతి సుంకం సవరణ అనేది అతిపెద్ద విధాన మార్పు. ఇది సరఫరా వ్యవస్థ మొత్తం ఖర్చులను పెంచుతుంది. కానీ వినియోగదారులు బంగారాన్ని ఎలా వినియోగించాలో మళ్లీ ఆలోచించే అవకాశాన్ని కూడా ఇది ఇస్తోంది. పాత బంగారం తీసుకొచ్చి కొత్త నగలతో మార్చుకోవాలని మా వినియోగదారులను బలంగా ప్రోత్సహిస్తున్నాం’’అని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించుకుంటూ కొత్త డిజైన్లు పొందేందుకు ఇది ఉత్తమ మార్గాల్లో ఒకటని అంటున్నారు.
పాత బంగారం మార్పిడిలో ఆఫర్లు
తనిష్క్ సంస్థ తన పాత బంగారం మార్పిడి కార్యక్రమాన్ని #ఓల్డ్‌గోల్డ్‌న్యూఇండియా ప్రచారంతో పెంచుకుంది. కల్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇటీవల ‘నేషన్ ఫస్ట్ - గోల్డ్4ఇండియా ఇనిషియేటివ్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. పాత బంగారం మార్పిడి, తక్కువ బరువు ఉన్న 18 క్యారెట్ నగల వినియోగం, గోల్డ్ మానిటైజేషన్ పథకాలు, బంగారం పునర్వినియోగ కార్యక్రమాలపై సంస్థ దృష్టి పెట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థకు చెందిన 342 దుకాణాల్లో వినియోగదారులు వాడని, పాడైన, పాత నమూనాల నగలను మార్చుకునేలా ప్రోత్సహిస్తారు. దీంతో కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన బంగారం అవసరం తగ్గుతుంది.
ఇటీవల ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం దిగుమతి ఖర్చులు, ప్రస్తుత ఖాతా లోటు, బంగారం ధరల పెరుగుదలపై ఆందోళనలు మరింత పెంచింది. ప్రస్తుత ఖాతా లోటు అంటే.. విదేశాలకు చెల్లింపులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయం మధ్య తేడా వల్ల ఏర్పడే లోటు. భారత్ దిగుమతి బంగారంపై ఎక్కువగా ఆధారపడటంతో, కొత్తగా కొనుగోలు చేయడానికి బదులు ఇళ్లలో వాడని బంగారాన్ని కొత్త నగలుగా మార్చుకోవాలని వ్యాపారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక సుంకం తాత్కాలికంగా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపొచ్చు. కానీ, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వొచ్చు. “భారత్‌లో బంగారం దిగుమతి సుంకం పెంపు స్థానిక ధరలను పెంచి, కొంతకాలం కొనుగోళ్లు తగ్గించే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచ అనిశ్చితి, దేశీయ కరెన్సీ ఒత్తిళ్ల సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుంది” అని నిపుణులు తెలిపారు.
గతంలో దిగుమతి సుంకం 15 శాతం ఉన్నప్పుడు కనిపించినట్లే.. అక్రమ రవాణా మళ్లీ పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో దిగుమతి బిల్లు తగ్గి విదేశీ మారక నిల్వలకు తాత్కాలిక మద్దతు లభించొచ్చని చెబుతున్నారు.
భారత్ మొత్తం దిగుమతి బిల్లులో బంగారం వాటా దాదాపు 9-10 శాతం ఉండటంతో, కొత్త దిగుమతుల బదులు దేశంలో ఇప్పటికే ఉన్న బంగారాన్ని పునర్వినియోగం చేయడం, మానిటైజేషన్‌పై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలకు ఆభరణాల రంగం అనుగుణంగా ముందుకు సాగుతోంది.
“భారత్‌లో ఇళ్లలో దాదాపు 25,000 టన్నుల వాడని బంగారం ఉందని అంచనా. అందులో కొంత భాగాన్నైనా నమ్మకమైన మానిటైజేషన్ వ్యవస్థ ద్వారా వినియోగంలోకి తీసుకొస్తే దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది” అని నిపుణులు తెలిపారు.


