ముంచుకొస్తున్న నీటి గండం! | India Faces Severe Water Crisis as Reservoir Levels Plunge Heatwave | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా ముంచుకొస్తున్న నీటి గండం!

Mar 20 2026 2:22 PM | Updated on Mar 20 2026 2:31 PM

India Faces Severe Water Crisis as Reservoir Levels Plunge Heatwave

దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న వేళ భారత్ తీవ్రమైన జల సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని 166 ప్రధాన జలాశయాల్లో 40 శాతానికి పైగా రిజర్వాయర్లు వాటి పూర్తి సామర్థ్యంలో సగం కంటే తక్కువ నీటి నిల్వను కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి దేశంలోని అన్ని ఆనకట్టల సగటు నీటి మట్టం 51 శాతానికి పడిపోయింది.

ప్రస్తుత పరిస్థితి

కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం, ఈ 166 జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 183.565 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా, ప్రస్తుతం కేవలం 94.063 బీసీఎం (51 శాతం) మాత్రమే నీరు నిల్వ ఉంది. వాటిలో..

  • 39 జలాశయాలు: 40 శాతం కంటే తక్కువ నిల్వ.

  • 33 జలాశయాలు: 50 శాతం కంటే తక్కువ నిల్వ.

  • కేవలం 1 జలాశయం: ఝార్ఖండ్‌లోని జఖేత్ హిల్ రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం 100 శాతం నిండి ఉంది.

  • 18 జలాశయాలు: 80 శాతానికి పైగా నిల్వను కలిగి ఉన్నాయి.

లోటు వర్షపాతం

ఈ జల సంక్షోభానికి ప్రధాన కారణం.. లోటు వర్షపాతమని నివేదికలు చెబుతున్నాయి. ఐఎండీ అందించిన 726 జిల్లాల డేటా ప్రకారం, మార్చి 1 నుంచి దేశంలోని 78 శాతం ప్రాంతాల్లో వర్షపాతం అసలు లేకపోవడం అధిక భారీ లోటు నమోదైంది. ఏడాది ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా వర్షపాతంలో 70 శాతానికి పైగా లోటు ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

ఈ పరిణామాలకు దారితీసిన కారణాలు

రుతుపవనాల అనంతర కాలంలో, ఈ ఏడాది ప్రారంభంలో కురవాల్సిన వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్లలోకి ఇన్-ఫ్లో నిలిచిపోయింది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడంతో బాష్పీభవనం పెరిగి నీటి మట్టాలు వేగంగా తగ్గుతున్నాయి. వేసవి పంటల సాగుకు, తాగునీటి అవసరాలకు డిమాండ్ పెరగడంతో నిల్వలు వేగంగా ఖర్చవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులు భారత వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపి వర్షపాతాన్ని తగ్గించాయి.

ప్రాంతంజలాశయాల సంఖ్యప్రస్తుత నిల్వ శాతంస్థితిగతులు
దక్షిణ భారతం4241%తెలంగాణ (35% దిగువకు), కర్ణాటక (40% కంటే తక్కువ) ఆందోళనకరంగా ఉన్నాయి.
ఉత్తర భారతం1145.5%హిమాచల్‌ప్రదేశ్‌ 40% లోపు ఉండగా, పంజాబ్, రాజస్థాన్లలో 55% పైగా ఉంది.
తూర్పు భారతం2750%అస్సాం (20%), పశ్చిమ బెంగాల్ (25%) కనిష్ట స్థాయిలో ఉన్నాయి.
పశ్చిమ భారతం5362%గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.
మధ్య భారతం2857%ఛత్తీస్‌గఢ్‌ (71%) మెరుగ్గా ఉండగా, ఉత్తరాఖండ్ (43%) తక్కువగా ఉంది.

 

గడిచిన 10 ఏళ్ల సగటుతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్త నీటి నిల్వలు సాంకేతికంగా కొంత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ (గత ఏడాది కంటే 13.5 శాతం పాయింట్లు ఎక్కువ), లోటు వర్షపాతం రాబోయే రోజుల్లో సవాలుగా మారనుంది. అయితే, సమీప భవిష్యత్తులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దాంతో రిజర్వాయర్ల మట్టం తగ్గే వేగం కొంత నిమ్మదిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement