కేంద్రం తీపి కబురు, అయినా.. ఆందోళనే! | India bans sugar exports till September to curb domestic price rise | Sakshi
Sakshi News home page

కేంద్రం తీపి కబురు, అయినా.. ఆందోళనే!

May 14 2026 8:18 AM | Updated on May 14 2026 8:26 AM

India bans sugar exports till September to curb domestic price rise

భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార ఎగుమతులపై సెప్టెంబర్‌ దాకా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్‌లో ధరలు పెరగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా, ఈయూలకు మాత్రం ఈ బ్యాన్‌ వర్తించబోదని స్పష్టం చేసింది. అయితే కేంద్రం తాజా ప్రకటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారులలో ఒకటి. ఇటీవల వర్షాభావం, పంట ఉత్పత్తి తగ్గుదల, నిల్వలపై ఒత్తిడి కారణంగా దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. పండుగల సీజన్‌లో వినియోగం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా ఎగుమతులను నిలిపివేసింది.

ముడి, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు కేంద్రం నిషేధం విధిస్తూ సంచలన ప్రకటన చేసింది. సెప్టెంబర్ తర్వాత పరిస్థితిని సమీక్షించి, ఎగుమతులపై కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వర్షాకాలం తర్వాత పంట ఉత్పత్తి స్థాయిలు, నిల్వలు, ధరలపై ఆధారపడి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని సమాచారం. అయితే.. 

ఈ చర్య దేశీయ మార్కెట్లో ధరలను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్లో చక్కెర కొరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. అయితే అంతర్జాతీయంగా భారతదేశం చక్కెర ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో.. ఎగుమతులు నిలిపివేయడం వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా తగ్గి ధరలు పెరగవచ్చు. అలాగే వ్యాపారాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎగుమతులపై ఆధారపడిన వ్యాపారులు, ట్రేడర్లు నష్టపోవచ్చు. 

కేంద్రం తాజా నిర్ణయంపై ఆర్థిక విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే.. ఈ నిర్ణయం తాత్కాలికంగా దేశీయ మార్కెట్‌కు మేలు చేస్తుంది. కానీ ప్రపంచ మార్కెట్లో అస్థిరతను పెంచుతుంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలు భారత చక్కెరపై ఆధారపడుతున్నందున, అక్కడ ధరలు పెరగడం ఖాయం.

Advertisement
 
Advertisement
Advertisement